బహ్రెయిన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేం దుకు కుదుర్చుకునే ఏ ఒప్పందం అయినా గల్ఫ్ దేశాల భద్రతా ప్రయోజనాలను కాపాడుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. బహ్రెయిన్ లో ఆయన గురువారం గల్ఫ్ అరబ్ విదేశాంగ మంత్రులు, అధికారులతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాల శత్రువు అయిన ఇరాన్‌తో శాంతిని నెలకొల్పుకోవాలని అమెరికా భావిస్తోందని, అయితే అది తమ గల్ఫ్ భాగస్వాముల భద్రతకు, సౌభాగ్యానికి ఎలాంటి ప్రమాదం కలిగించబోదని తెలిపారు. అంతకుముందు ఆయన యుఏఈ, కువైట్లలో కూడా పర్యటించారు. ప్రతిపాదిత ఒప్పందం పూర్తిగా ఇరాన్‌కు అనుకూలమైనదిగా ఉండబోదని రుబియో చెప్పారు. ‘మిత్రదేశాల భద్రతకు విఘాతం కలిగించే పనులేవీ చేయం’ అని అన్నారు. హార్ముజ్‌లో రుసుములు, ఫీజులు వసూలు చేయడాన్ని గల్ఫ్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయని రుబియో తెలిపారు. చర్చల సందర్భంగా గల్ఫ్ నేతలు తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేశారని, హార్ముజ్‌లో రుసుములు-ఫీజుల వసూలుకు మద్దతు ఇవ్వబోమని తెలిపారని చెప్పారు. గల్ఫ్ నేతలతో చాలా మంచి సమావేశాలు జరిగాయని అన్నారు. కాగా గల్ఫ్ నేతలతో జరిపిన సమావేశాలలో ఇరాన్ పునర్నిర్మాణ నిధి ప్రస్తావన రాలేదని రుబియో రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
గల్ఫ్ భద్రతా ప్రయోజనాలు కాపాడతాం : రుబియో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



