చిన్నారులకు పోలియో చుక్కలు తప్పక వేయించాలి
హైదరాబాద్ బోరబండలోని పీహెచ్‌సీలో పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి
దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలియో రహిత సమాజమే మన ముందున్న లక్ష్యం అని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. ఆదివారం రాష్ట్రస్థాయి పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ బోరబండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ నవీన్ యాదవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 41లక్షల మంది చిన్నారులకు 22వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు, 900 ట్రాన్సిట్ పాయింట్‌లలో పోలియో చుక్కలు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ పోలియో కార్యక్రమంలో 52 లక్షలకు పైగా వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 5 లక్షలకు పైగా ఉన్న చిన్నారుల కోసం 2,800 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలియో లేదనే భావన మనలో ఉండకూడదనీ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియో వల్ల కలిగే నష్టాలు, అలాగే అంగ వైకల్యంపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఇంటింటి సర్వేలో వైద్య సిబ్బంది మూడు రోజులు పర్యటించి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ, చైల్డ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విజయ నిర్మల, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డీఎంఅం డ్‌హెచ్‌ఓ డాక్టర్ సాయిబాబా, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
పోలియో రహిత తెలంగాణే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



