కన్నూర్ రైల్వే స్టేషన్లో ఘటన
ఆస్పత్రిలో వీణాజార్జ్‌ని పరామర్శించిన సీఎం పినరయి విజయన్
కన్నూర్ : కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్‌పై కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం కన్నూర్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. గాయపడిన మహిళా మంత్రిని చికిత్స నిమిత్తం కన్నూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేరళ సీఎం పినరయి విజయన్ ఆస్పత్రికి వెళ్లి వీణాజార్జ్ను పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కల్లియాడ్‌లో అంతర్జాతీయ ఆయుర్వేద పరిశోధన కేంద్రాన్ని బుధవారం కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ ప్రారంభించారు.
అనంతరం కన్నూర్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫాంపైకి వస్తుండగా ఆమెపై కేఎస్‌యూ కార్యకర్తలు దాడికి తెగించారు. మహిళ అని కూడా చూడకుండా ఆమె చేతిని పట్టుకుని ఒక్కసారిగా ఆమెను దూరంగా నెట్టివేశారు. దీంతో ఆమె మెడ, చేతికి గాయాలయ్యాయి. గత ఆదివారం కూడా యూత్ కాంగ్రెస్ దుండగులు మంత్రి వీణాజార్జ్ అధికారిక నివాసంపై దాడి చేశారు. గేటును ధ్వంసం చేసి ఆమె ఇంట్లోకి చొరబడి అక్కడ అంత్యక్రియల పుష్పగుచ్ఛం ఉంచారు. ఇలా జిల్లా అంతటా యూడీఎఫ్ కార్యకర్తలు ఆమెపై వరుస హింసాత్మక దాడులకు ప్లాన్ చేశారు.
దుర్మార్గపు రాజకీయలకు ప్రతిబింబం : సీఎం పినరయి
”కన్నూర్‌లో ఆరోగ్య మంత్రి వీణాజార్జ్‌పై కేఎస్‌యూ దాడికి పాల్పడటం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాలకు ప్రతిబింబం. కేరళ భారతదేశంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని కలిగి ఉంది. ఈ వాస్తవాన్ని అన్ని అధికారిక సంస్థలు గుర్తించాయి. అయినప్పటికీ, ఏ విధంగానూ ప్రమేయం లేని మంత్రిపై దాడిని రాజకీయంగా చూడలేం. ”
దాడికి వ్యతిరేకంగా నేడు నిరసనలు
మంత్రి వీణాజార్జ్‌పై దాడి పట్ల కేరళ వ్యాప్తంగా గురువారం నిరసనలకు సీపీఐ(ఎం), ఎల్డీఎఫ్, ఎస్ఎఫ్ఐలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల ముసుగులో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించాయి.



