నేటికీ అందని పూర్తి స్థాయి పరిహారం
ఏడాది కావస్తున్నా చెల్లించింది రూ.50 లక్షలు మాత్రమే..
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
మానవత్వం చూపని యాజమాన్యం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సిగాచీ ఘటనకు నేటితో ఏడాది పూర్తయినా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల ఆర్తనాదాలను యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, కంపెనీ పరిహారం అందకపోవడంతో ఆ అభాగ్యులు న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ 30, 2025న పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 54 మంది కార్మికులు మరణించగా, 28 మంది గాయపడ్డారు. మరణించిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సిగాచీ ఇండస్ట్రీస్ బహిరంగంగా ప్రకటించాయి. ప్రస్తుతం సిగాచీ ఇండస్ట్రీస్ కుటుంబానికి సరాసరి కేవలం రూ. 45 లక్షల చొప్పున సుమారు రూ.24.5 కోట్లు చెల్లించింది. ఇంకా 54 కుటుంబాలకు మొత్తం రూ. 29.5 కోట్లకు పైగా బకాయిలు ఇంకా అందాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పిస్తామన్న పరిహారం కోసం నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా పరిశ్రమ యాజమాన్యం మాత్రం మానవత్వం చూపడం లేదు. సెబీకి ఇచ్చిన నివేదికలో బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామనీ, వంద రోజుల పాటు స్టాక్ ఎక్సేంజ్ నుంచి తప్పుకుంటున్నామని లేఖ రాసిన యాజమాన్యం చేతల్లో మాత్రం ఆ మాట నిలుపుకోలేదు. ఇది ఒక్కరిదో.. ఇద్దరిదో కాదు.. 54 బాధిత కుటుంబాల కన్నీటి ఘోష. ఆ కార్మికుల కుటుంబాలను కదిలిస్తే చాలు కండ్లలో నుంచి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి నోటి వెంట మాటలు కూడా రావట్లేదు. ఒక్కో కుటుంబానికి ఒక్కో గాథ..
పరిహారం అందించడంలో విఫలం..
కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ నెరవేరలేదు. ఘటన జరిగిన రోజు మీడియా ముందు హడావిడి చేసిన బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పత్తాలేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ఇప్పిస్తామన్న హామీ అటకెక్కింది. జీవచ్ఛవంలా మారి కుటుంబాలకు భారమైన క్షతగాత్రుల్లో కొందరు రూ.10లక్షలు, మరికొందరికి రూ.5 లక్షలు, ఎక్కువ మందికి రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ప్రభుత్వం వేసిన ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు ప్రకారం కంపెనీ నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలు 2019 నుంచి 2024 వరకు తనిఖీలు లేకుండా యధాలాపంగా సర్టిఫికెట్స్ జారీ చేయడం కూడా తప్పిదంగా గుర్తించినప్పటికీ, ఎవరిపైనా చర్యలు లేవు. బాధిత కుటుంబాలకు మిగిలిన డబ్బును చెల్లించి పూర్తి న్యాయం చేయాలని, గాయాలపాలై ఇప్పటికి చికిత్చ తీసుకుంటున్న ముగ్గురికి పూర్తి వైద్యం అందించాలని, వారికి వేతనాలు చెల్లించాలని, వారికి నష్ట పరిహారం కోటి రూపాయలకు పెంచాలని, సరియైన తనిఖీలు చేయకుండా కంపెనీకి క్లీన్ చీట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న.. : రాజేష్ కుమార్ చౌదరి, బాధితుడు
షిగాచీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకున్నాను. ఇంకా తగ్గలేదు. కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆర్థిక సహాయం కోసం కంపెనీ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. న్యాయం చేయాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి : సుష్మ, బాధితురాలు
కంపెనీ పేలుడులో గాయపడ్డ తనను ఆస్పత్రిలో చేర్పించారు. గతంలో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు. కానీ ఇంకా నయం కాకుండానే ఇంటికి పంపించారు. తనకు కావలసిన చికిత్సకు సహాయం చేయడం లేదు. గతంలో ఆస్పత్రి చార్జీలు మాత్రమే చెల్లించారు. తన చికిత్సకు అవసరమైన సహాయం అందించాలని కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగి సంవత్సరం దాటుతుంది. మమ్మల్ని ఆదుకోవాలి.
బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి
సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృత్యుఘోష ఘటనకు ఏడాది అవుతుంది. 54 మంది మృతి చెంది అందులో 8 మంది పూర్తిగా కాలి బూడిదయి డీఎన్ఏ టెస్ట్‌కు సైతం దొరకకపోవడం చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో అర్థం అవుతుంది. మరో 28 మంది కార్మికులు తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవల్లా బతుకీడుస్తున్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్కు డబ్బులు లేక కుటుంబాలు గడవక ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ఘటన జరిగి ఏడాది అవుతున్నా ఇంకా పూర్తి నష్టపరిహారం అందకపోవడం దారుణం.
-అతిమేల మానిక్, సీఐటీయూ
రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు
సిగాచీ ప్రమాదానికి ఏడాది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



