సాంకేతికత వినియోగం ప్రతిరంగంలోనూ అవసరమే. దీనిద్వారా ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం, అక్రమాలను అరికట్టడం, సబ్సిడీ ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడడం మంచిదే. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలకు సౌలభ్యాన్ని కల్పించినప్పుడే దాని అసలు ప్రయోజనం నెరవేరుతుంది. కానీ ఆ పేరుతో మొత్తం వ్యవస్థనే నాశనం చేయాలని చూస్తే పెద్దలకు లాభం తప్ప పేదలకు మేలు జరగదు. దానికి ఉదాహరణే యూరియా యాప్. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న టెక్నాలజీ (యాప్ ఆధారిత విధానం) కూడా రైతులకు సౌలభ్యం కంటే ఇబ్బందులనే మరింత తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఈ విధానం నిద్రపట్టనీయడం లేదు. ఈ యాప్ వెనుక కుట్ర ఉందని అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పాత వాదననే పునరుద్ఘాటిస్తోంది. అక్రమాలను అరికట్టేందుకే ఈ విధానమని చెబుతోంది. మరి అలాంటప్పుడు రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారన్నదానికి సమాధానం లేదు.
యూరియా పక్కదారి పడుతున్నదని, నిజమైన రైతులకు సబ్సిడీ అందడం లేదంటూ రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ‘ఫ్రేమ్ వర్క్ ఆప్ ఫర్టిలైజర్ సేల్’ విధానం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగమూ లేదు. ఈ యాప్ ద్వారా రైతుల పాసు పుస్తకాల్లో నమోదైన భూముల ఆధారంగా అవసరమైన ఎరువులను బుకింగ్ చేసుకోవాలి. కేంద్రం రాయితీ ఇస్తున్న యూరియా, ఇతర ఎరువులను ఈ యాప్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత రైతు మొబైల్‌కు ఓటిపీ వస్తుంది. దీన్ని చూపి నిర్దేశించిన మొత్తంలో కేటాయించిన ఎరువులను ప్రయివేటు దుకా ణాల్లో కొనుగోలు చేయాలి. యాప్ తీర్చిద్దినంత సులువుగా ఎరువుల కేటాయింపు లేదు. బుకింగ్ సమయంలో ఆ మండలంలో ఏ డీలర్ వద్ద యూరియా ఉంటే అక్కడే రైతులకు రెండు బస్తాల యూరియాను కేటాయిస్తారు. ఎకరా ఉన్న రైతులకు ఒకేసారి, ఎకరం నుంచి ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు విడతల వారీగా ఎకరాకు రెండు బస్తాలు చొప్పున యూరియాను అందిస్తారు. యాప్‌లో ఒకసారి రెండు బస్తాలు మాత్రమే కేటాయింపు చేసుకోవాలి. ఐదు నుంచి పది ఎకరాల వరకు సాగుచేసే రైతులు అయిదు నుంచి పదిసార్లు బుక్ చేసుకోవాలి.
ఈ విధానం చూస్తే సాధారణ రైతు వ్యవసాయం మానేసి, ఎరువుల బస్తాలు ఎప్పుడొస్తాయన్నది దుకాణం ముందు కూర్చొని ఎదురు చూడాలి. వాస్తవానికి ఎకరా ఉన్న రైతుకు రెండు బస్తాలు కేటాయించినా వాటిని తెచ్చుకోవా లంటే 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వెళ్లి తెచ్చుకోవాలి. ఐదు, పదెకరాలు ఉన్న రైతులు రెండు బస్తాలు చొప్పున అన్నిసార్లు బుక్ చేసుకోవడానికి పడరాని పాట్లు పడాల్సిందే. పాసు పుస్తకాలున్న రైతులకే యూరియా కేటాయింపు అంటే చాలామంది రైతులకు పాసు పుస్తకాలు లేవు. అందులోనూ తప్పులు ఉంటే యాప్ తీసుకోదు. యాప్ ఓపెన్ కావాలంటే మంచి మొబైల్ ఉండాలి. దానికి తగట్టు యాప్‌ను ఓపెన్ చేసే పరిజ్ఞానం ఉండాలి. వాటిని అసలైన రైతు ఏమి అందుకుంటాడు. భూస్వాములు, పలుకుబడి ఉన్న ధనిక రైతులు తిరగకుండానే యూరియా ఇంటికి వచ్చేస్తుంది. అంటే, ఈ యాప్ పెద్లొళ్లకు మేలు చేస్తుందా? పేదలకా అన్నది ఇట్టే తెలిసిపోతోంది.
అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్‌లకు కేటాయించే నలభై శాతం యూరియా ఆయా జిల్లాల రైతులకే కేటాయిం చాలన్న నిబంధన లేదు. వందలాది ఎరువుల బస్తాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా పట్టించుకునే నాధుడు లేదు. ఫలితంగా యూరియా కొరత నెలకొని ఆందోళనలకు దారితీస్తోంది. యాప్ బాగుందని, నిజమైన రైతుల కు ఎరువులు అందుతాయని ప్రభుత్వం నమ్మబలికింది. గత ఖరీఫ్‌లోనే కొన్నిచోట్ల యాప్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలోనే రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయలేదు. ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్రం సూచనలతో యాప్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం దుర్మార్గమైన చర్య. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేవని ఇప్పటికే రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎరువు కోసం సహకార సంఘానికి, ఎరువుల దుకాణానికి వెళితే వ్యవసాయం చేసేదెప్పుడు?
అలాగే, ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కౌలు రైతులు. వారి అవసరాలు, సౌకర్యాలు గుర్తించకుండా రూపొందించిన విధానం సమగ్ర వ్యవసాయ విధానం ఎలా అవుతుంది? నేడు తెలంగాణలో కౌలురైతుల సంఖ్య బాగా పెరిగింది. సాగు చేస్తున్నది ఒకరు, భూయజమాని మరొకరు. కానీ యాప్ భూ యజమాని వివరాల ఆధా రంగానే వ్యవహరించడం వల్ల కౌలు రైతులు ఎరువులందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యూరియా అక్రమ మళ్లింపు, బ్లాక్ మార్కెట్, సబ్సిడీ దుర్వినియోగం వంటి సమస్యలను నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యాప్ మాటున ఎరువుల వాడకాన్ని తగ్గించాలని చూస్తే రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. యాప్‌ను వెంటనే రద్దు చేసి రైతులకు సులువైన మార్గంలో ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే యాప్ కుట్రకు రైతులు బలయ్యే ప్రమాదముంది.
‘యాప్’ కుట్ర!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



