Thursday, July 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువీబీ గ్రామ్‌‌ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

వీబీ గ్రామ్‌‌ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

- Advertisement -

సెంట్రల్‌ ‌లేబర్‌ ‌కార్యాలయం ఎదుట
సీఐటీయూ, రైతు సంఘం, వ్యకాస ధర్నా

ఆగస్టు 10న 
జైల్‌ ‌భరో విజయవంతం చేయాలని 
పిలుపు

​నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో తీసుకొచ్చిన వీబీ గ్రామ్‌ ‌జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ ‌చేశాయి. బుధవారం హైదరాబాద్‌‌లోని సెంట్రల్ లేబర్ కార్యాలయం వద్ద ప్లకార్డులు, జెండాలు పట్టుకుని నిరసన చేపట్టారు. వ్యవసాయ కూలీల పొట్ట కొట్టే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి జె. కుమారస్వామి అధ్యక్షత వహించగా, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఈ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దానికి తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. దేశవ్యాప్తంగా 765 కోట్ల మంది కార్మికులకు 125 రోజుల పని కల్పించాలంటే రూ.3.30 లక్షల కోట్లకు పైగా అవసరమవుతుందనీ, అయితే కేంద్రం కేవలం రూ.97 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు.

పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఏటా 200 రోజుల పని కల్పించాలనీ, రోజువారీ వేతనం రూ.800కు పెంచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, గ్రామీణ పేదల హక్కులను హరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో పని దినాలు, కనీస వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్లను పట్టించుకోకుండా, చట్టం పేరును మార్చి కొత్త చట్టాన్ని తీసుకురావడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏండ్లలో ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ బలహీనపర్చే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం వ్యయం భరించే విధానాన్ని మార్చి రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచడం వల్ల తెలంగాణపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన వైఖరి తీసుకుని ప్రజల పక్షాన ఉద్యమాల్లో పాల్గొనాలని కోరారు.

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం బలహీనపడితే గ్రామాల్లోని పేదలు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పట్టణాలకు వలస వచ్చిన కార్మికుల జీవన పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రంలోని 12,763 గ్రామాల్లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రచ్చబండలు, స్ట్రీట్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ కొత్త చట్టం కార్మికుల ప్రయోజనాల కోసం కాకుండా కాంట్రాక్టర్లు. ధనిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంతోనే సరిపోదనీ, కొత్త చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ జె. వెంకటేష్, జె. మల్లిఖార్జున్, వంగూరు రాములు, కె. ఈశ్వరరావు, విఎ.రావు, కూరపాటి రమేష్, పి. శ్రీకాంత్, పి. సుధాకర్, సిహెచ్.భానుకిరణ్, రైతు సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ మూడ్ శోభనాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ పద్మ, సీఐటీయూ నగర అధ్యక్షులు దశరథ్, నగర ఆఫీస్ బేరర్స్ అజయ్‌ ‌బాబు, సి. మల్లేష్, రాములు, అశోక్, కామేష్ బాబు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -