Friday, July 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీస్ శాఖలో 
మరో అవినీతి అనకొండ

పోలీస్ శాఖలో 
మరో అవినీతి అనకొండ

- Advertisement -

ఏసీబీ దాడుల్లో వెల్లడి
కొనసాగుతున్న సోదాలు


నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీస్ శాఖలో మరో భారీ అవినీతి అనకొండ ఏసీబీకి చిక్కింది. ఈ అనకొండ అక్రమాస్తులు ఒకటి, రెండు కాదు రూ. వందల కోట్లలోనే ఉన్నట్టు వెల్లడైంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర పీసీఎస్ లో డీఎస్పీగా పని చేస్తున్న ఎస్ భీం రెడ్డి ఆదాయానికి మించి కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టినట్టు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో ఏసీబీ అధికారులు డీఎస్పీ భీంరెడ్డికి చెందిన ఇంటితో పాటు హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల తో పాటు సరిహద్దులోని కర్నాటక రాష్ట్రంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న కొద్దీ బయట పడుతున్న ఈ అవినీతి పోలీసు అధికారి అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే విస్తు పోయారు. ఈ అక్రమాస్తుల వివరాలను పరిశీలిస్తే ఇబ్రహీంబాగ్ లో ఒక విల్లా , టెలికాం నగర్ లో జి +2 పెంట్ హౌస్ తో కూడిన ఇల్లు, ఇదే కాలనీ లో ఒక అపార్ట్మెంట్ లో విలువైన ఫ్లాటు, గచ్చిబౌలిలో ని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాటు, మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్ లో ఒక ఐదు అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు గుర్తించారు.

అదే విధంగా మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద 3000 గజాల స్థలం, తెల్లాపూర్ అభినందన్ రెసిడెంటల్‌‌లో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ లో ఓపెన్ ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 3.5ఎకరాల వ్యవసాయ భూమి, కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లాలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, మరో జిల్లా లో 38 ఎకరాల వ్యవసాయ భూమి బయట పడింది. బెంగుళూర్ లోని దేవనహళ్లి లో మరోఎకరా భూమి, నాగోల్ లో 200 గజాల ప్లాట్, జీపీఆర్ హౌసింగ్ సొసైటీ లో 400 గజాల ప్లాట్, పటాన్‌ ‌చెరులో మరో 200 గజాల ప్లాట్ కూడా ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. మోమిన్‌పేట్ లో 1000 గజాల ప్లాట్ , ‌రెండెకరాల వ్యవసాయ భూమి, రాఘవేంద్ర మినరల్స్ లో రూ.75 లక్షల పెట్టుబడి పెట్టినట్టు తేలింది. దీంతో పాటు ముచ్చింతలలో 20 ఎకరాల వ్యవసాయ భూమి , తన నివాసం లో రూ .3.6 లక్షలు, బినామీ ఇంట్లో రూ. 40 లక్షల నగదు తో పాటు రెండు కిలోల బంగారు నగలు, 20 కిలోల వెండి నగలు, బ్యాంకు లో రూ.19 లక్షల బాలన్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భీం రెడ్డి నివాసంలో 23 ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లనూ అధికారులు స్వాధీనం చేసుకుని మరిన్ని ఆస్తుల కోసం దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆస్తుల విలువను అంచనా వేస్తున్నామనీ, బహిరంగ మార్కెట్‌‌లో వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -