Friday, July 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలు

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలు

- Advertisement -

దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15వరకు పాదయాత్రలు
సెప్టెంబర్‌ 1న చలో ఢిల్లీ : సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
వామపక్ష‍ పార్టీల ఆధ్వర్యంలో ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటం
ఈ నెల ఆరో తేదీన ఇందిరాపార్కు వద్ద మహాధర్నా : ఎమ్మెల్యే కూనంనేని
మోడీ ప్రజలకిచ్చిన హామీలు బుట్టదాఖలు

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ 2014లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారనీ, ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకెళ్తూ ఫక్తు ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరో తేదీ నుంచి పది రోజుల పాటు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతామనీ, సెప్టెంబర్‌ ఒకటో తేదీన చలో ఢిల్లీ పిలుపులో భాగంగా రామ్‌‌లీలా మైదానంలో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ మాట ప్రకారం ఏటా రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలిస్తే ఇప్పుడు దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగం ఉన్నది మన దేశంలోనేనని విమర్శించారు. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న డబ్బులు ఏమయ్యాయని నిలదీశారు. నరేగా స్థానంలో వీబీగ్రామ్‌‌జీ పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా పోతుందని హెచ్చరించారు. ఆ పథకాన్ని బీజేపీ పాలిత రాష్ర్టాలే వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం తగ్గితే లీటర్‌ ‌పెట్రోల్‌‌కు ముష్టి మూడు రూపాయలు తగ్గించి గొప్ప ఉపశమనం కలిగించినట్టు ప్రచారం చేసుకోవడాన్ని ఎత్తిచూపారు.

రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ రాముడికే కుచ్చుటోపీ పెట్టడం దుర్మార్గమనీ, అయోధ్య రామమందిరం నిధుల గోల్‌‌మాల్‌‌లో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారని గుర్తచేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీయడాన్ని తప్పుబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… హన్మకొండలో పేదల గుడిసెలను ప్రభుత్వం కూల్చడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఐ(ఎం), తదితర వామపక్ష‍ పార్టీల ఆధ్వర్యంలో హన్మకొండను దిగ్బంధనం చేశామని గుర్తుచేశారు. విద్యుత్‌, ముదిగొండ భూ పోరాటాల తరహాలో ‘ప్రతి గుడిసెకూ పట్టా..ప్రతి పేదలకూ ఇల్లు’ అనే నినాదంతో వామపక్ష‍ పార్టీల ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఈ నెల ఆరో తేదీన ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పేదలతో మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పోడు సాగును అడ్డుకోకుండా ఆదివాసీగిరిజనులకు పోడు హక్కు పత్రాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అప్పులు, లాభాల విషయంలో సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి చిక్కుకున్నదనీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ‌సర్కారు విఫలమవుతున్నదని విమర్శించారు. భూభారతిలో కాస్తు కాలాన్ని పొందుపర్చాలని డిమాండ్‌ ‌చేశారు. స్థానిక సంస్థలు, ఆస్పత్రుల్లో పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతనాలు వర్తించేలా జీవో విడుదల చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -