సీఎస్సీ ఆరోగ్య పరీక్షలను రద్దు చేయాలి
సహజ మరణానికి రూ.ఐదు లక్షలివ్వాలి
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
దశలవారీ పోరాటానికి భవన నిర్మాణ కార్మికులు సన్నద్ధం : సీ డబ్ల్యూ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షులు ఎం సాయిబాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ తెచ్చిన జీవో నెంబర్ 12 ను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగించాలి. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలి. సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి. సీఎస్‌సీ హెల్త్ టెస్టులు ను రద్దు చేయాలి’ అని కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎం సాయిబాబు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన బిల్డింగ్ వర్కర్స్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామనీ, ప్రజా పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం,శాశ్వత,పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రయివేటు బీమా కంపెనీలకు ఇచ్చి అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. ప్రజాపాలనంటే..కార్మికుల సంక్షేమ నిధిని దుర్వినియోగం చేయడమేనా? అని ప్రశ్నించారు. సీఎస్సీఈ హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని కోరారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద రూ. 2,309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎస్‌సీ హెల్త్ చెకప్ పేరుతో రూ.750 కోట్లు కాజేశారని చెప్పారు. కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి, అధికారులకు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణరంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు నిధుల దుర్వినియోగానికి నిరసనగా రాష్ట్రంలో దశలవారీ పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాస్, టీ ఉప్పలయ్య, అరురూ కుమార్, బి శ్రీనివాస్, ఏ రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



