‘ప్రతి గుడిసెకూ పట్టా … ప్రతి పేదకూ ఇల్లు’ నినాదంతో ప్రజల్లోకి
లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పేదలు వేసుకున్న ప్రతి గుడిసెకూ పట్టా ఇవ్వాలనీ, ప్రతి పేదకూ ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద వేలాది మందితో మహాధర్నా నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్ లో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. గోవర్దన్, మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. హన్మేశ్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు భరత్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు అబ్బాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ. నర్సింహ, పశ్యపద్మ, తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ప్రతి గుడిసెకూ పట్టా – ప్రతిపేదకూ ఇల్లు’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. పేదలను సమీకరించి నిరంతరం ఆందోళనలను నిర్వహిస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహా ధర్నాలో వేలాది మంది పేదలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
6న వామపక్షాల మహాధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



