పౌర సమాజం ప్రశ్నించాలి : ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్
నవతెలంగాణ -ఉస్మానియా యూనివర్సిటీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో పారదర్శకత లోపం, జవాబుదారీతనం సమస్యలు, విధానపరమైన లోపాలపై పౌర సమాజం, మేధావులు ప్రశ్నించాలని ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకులు, రచయిత డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత పి.వి. నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకుని గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సీఎస్టీడీ భవనంలోని డా. సి. నారాయణ రెడ్డి ఆడిటోరియంలో పీవీ స్మారకోపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పరకాల ప్రభాకర్ ‘సర్ 2025-26: భారతదేశ సారాన్ని పలుచన చేస్తోందా?’ అనే అంశంపై ప్రసంగించారు. వందేమాతరంపై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి విధాన నిర్ణయాలపై విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. సర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆయన ఎత్తి చూపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ, సమాధానం లేని ప్రశ్నలు మిగిలే ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిశాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారని, దాని గురించి అడిగితే సరైన సమాధానం ఇచ్చేవారు లేరని ఆయన విమర్శించారు. 2002లో చేసిన విస్తృత సవరణలతో పోలిస్తే ప్రస్తుత ఓటర్ల జాబితా చాలా భిన్నంగా ఉందని ఆయన అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుండి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించినట్లు సూచించే గణాంకాలను ఎత్తి చూపుతూ, ఈ పోకడలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రక్రియ మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రోజువారీ కూలీలు, ఆర్థికంగా బలహీన వర్గాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా ఓట్లు కోల్పోతున్న వర్గాలు కూడా వీరేనని వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సర్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్ ప్రక్రియ ద్వారా అక్రమ వలసదారులను గుర్తించారనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడంతో చాలా మంది అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోవచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలోని వృద్ధుల సంఖ్య కంటే వారి ఓట్లు ఒక్కటి తక్కువైనా పట్టించుకోకుండా ఉండకూడదని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం జవాబుదారీతనం కోల్పోయిందనే అనుమానాలు ఇక్కడ ఉన్నాయని, సర్ విధాన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల కోసం ఆర్టీఐ యాక్ట్ కింద అభ్యర్థనలు చేస్తే, ఎలాంటి పత్రాలు అందుబాటులో లేవనే సమాధానం వస్తోందని వివరించారు.
ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి విధాన నిర్ణయాలపై మరింత పారదర్శకత, విస్తృత ప్రజా చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానకి అధ్యక్షత వహించిన యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి పునాది అని తెలిపారు. సర్ పేరుతో ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి, రాజనీతిజ్ఞుడిగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధమని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకే వందేళ్ల క్రితం దేశంలోని అన్ని వర్గాల వయోజనులకు ఒక ఓటు అనే సూత్రాన్ని ఆయన ప్రతిపాదించి రాజ్యాంగంలో పొందుప రిచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ (అకడమిక్) ఆచార్య జి. పుష్ప చక్రపాణి సమా వేశానికి స్వాగతం పలుకుతూ, భారతరత్న పి.వి. నరసింహారావు గారి దూరదృష్టితో కూడిన నాయకత్వం, రాజకీయ చతురత జాతీయాభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచాయని వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి మాట్లాడుతూ, భారతరత్న పి.వి. నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన అసాధారణ నాయకత్వం, మేధస్సు, రాజకీయ చతురత దేశంపై చెరగని ముద్ర వేశాయని అన్నారు.
పారదర్శకత, విధానపరమైన లోపాలతో సర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



