పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్
అరెస్టులు.. పలువురికి గాయాలు
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి, వేలాది పాఠశాలలను మూసివేస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రణకు తక్షణమే చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ముట్టడించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పలువురు నాయకులకు గాయాలయ్యాయి.
పోలీసుల జులుం.. విద్యార్థి నాయకుల అరెస్ట్
డైరెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపిస్తూ లాఠీలతో గాయపరిచారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి టి.నాగరాజుతో పాటు పలువురు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం పోలీసుల ద్వారా కాలరాస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తామని ప్రకటించడం బాధ్య తారాహిత్యమని అన్నారు. ఇది పేద విద్యార్థుల చదువుపై గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజుల దోపిడీపై సర్కార్ మౌనం ఎందుకు?
ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విమర్శించారు. తమిళనాడు తరహాలో ఫీజులను నియంత్రించి, బహిరంగంగా ప్రదర్శించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయ కేంద్రాలుగా మారినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.
‘అమ్మ ఆదర్శ పాఠశాల’ ముసుగులో మోసం
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, మరుగుదొడ్లు, తాగునీరు వంటి ప్రాథమిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయకుండా, ఎంఈవో పోస్టులను ఎఫ్‌ఏసీలతో నడిపిస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర వంటి సంస్థలకు అప్పగించి నాణ్యమైన పోషకాహారాన్ని దూరం చేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ విద్య, ఫిన్లాండ్ విద్యా విధానం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా లేవని ఎద్దేవా చేశారు.తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలనీ, పోలీసుల దాడులకు భయపడబోమని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యా ప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న, అరెస్టయిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, కె. అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కెవై.ప్రణయ్, కార్తీక్, లెనిన్ గువేరా, రమేష్, వెన్నెల, శ్రీకాంత్, లిఖిత్, చరణ్, తరంగ్, అరుణ్, నాగేందర్, స్టాలిన్, వినోద్, శ్రీరామ్, ప్రవీణ్, శ్రీకాంత్, చరణ్ తదితరులు ఉన్నారు.



