అభ్యంతరాలపై సుప్రీంకు వెళ్తాం
స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
టీచర్లు, సిబ్బందికి కూడా అక్కడే భోజనాలు
కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 6,278 పోస్టులకు ఆమోదం
‘మూసీ’ ఫేజ్‘1కు త్వరలో టెండర్లు.. దానికోసం
రూ.7345 కోట్లకు పరిపాలనా అనుమతులు
గోదాములు, ‘జవహర్ నవోదయ’ కోసం భూముల కేటాయింపులు
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
నవతెలంగాణ – హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఈనెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన ‘వికసిత భారత్‘గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ గ్రామ్‌జీ) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అదే సమయంలో దీనిలోని అభ్యంతరకర అంశాలపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంకర్‌నాయక్‌తో కలిసి మీడియా సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. వీబీ గ్రామ్‌జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జనవరిలో శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి, కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. కానీ కేంద్రం తాము సూచించిన ఎలాంటి సవరణలు చేయకుండా ఒంటెద్దు పోకడతో జులై 1 నుంచి అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారనీ, దానికి పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడిగా, మంత్రులు దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జీ వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
ఈ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగిందనీ, అనంతరం అనివార్యంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పేరు మార్పుతో పాటు రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలోని నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపిందన్నారు. ఈ నిబంధనల వల్ల జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం మోపుతూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్షంగా వీబీ గ్రామ్‌జీ పధకం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ తేల్చి చెప్పిందనీ, దానితో పాటు పలు సిఫార్సులు కూడా చేసిందని తెలిపారు. ఈ స్కీంలోకి అనివార్యంగా చేరిన ఇతర రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుని, 2026 జులై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. అభ్యంతరాలపై న్యాయపోరాటం కొనసాగిస్తూనే పార్లమెంట్‌లోనూ కేంద్రం తీరును నిలదీయాలని క్యాబినెట్ నిర్ణయించిదని తెలిపారు.
స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులందరికీ అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా వీటిని అందిస్తారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించడం, నిర్వహణలో జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని తెలిపారు.
6,278 పోస్టులు మంజూరు
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీరిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఉన్నాయి. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆస్పత్రులను నిమ్స్ తరహాలో అభివఅద్ధి చేయాలనీ, వైద్య సేవలకు సీఎం రిలిఫ్ ఫండ్, ఎలఓసీలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
గోదాంలకు భూములు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ రేట్ ప్రకారం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే జవహర్ నవోదయ విద్యాలయాల కోసం మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని క్యాబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించారు. దీనితో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కోసం భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
‘మూసీ’కి రూ.7,345 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఫేజ్-1లోని 21 కిలోమీటర్ల మేర పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీనికోసం రూ.7,345.12 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. హిమాయత్ సాగర్, ఈసా, ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫూఘాట్ వరకు ఈ పనులు చేపడతారు. దీనికోసం నూతనంగా 147 పోస్టుల క్రియేషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.



