చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడితే కట్టడి చేయరా?
ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారులు స్పందించాలి :
లేబర్ ఆఫీసు ఎదుట ధర్నాలో సీఐటీయూ
రాష్ట్ర అధ్యక్షులు
చుక్క రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకున్నారనే కక్షతో యాజమాన్యం వారిని అక్రమంగా విధుల్లోంచి తొలగించిందనీ, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని బిస్లరీ కంపెనీ యాజమాన్యం బదిలీల పేరిట కార్మికులను వేధింపులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బిస్లరీ పరిశ్రమ కార్మికులు యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్యం అధ్యక్షత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ‘బిస్లరీ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. చట్టబద్దంగా ఏర్పాటైన యూనియన్‌ను గుర్తించాలి. బిస్లరీ యజమాన్యాన్ని అరెస్టు చేయాలి. వర్కర్స్ యూనిటి జిందాబాద్, మజ్దూర్ ఏక్తా జిందాబాద్ జిందాబాద్’ అంటూ నినదించారు. అనంతరం కార్మిక శాఖ కమిషనర్, జేసీఎల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలోని కార్మికులు 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం చట్టబద్దంగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు.
వీరు చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకోవడానికి లేబర్ డిపార్ట్‌మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ బిస్లరీ కంపెనీ యాజమాన్యం యూనియన్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐదుగురు కార్మికులను పని లేదనే పేరుతో ఇతర ప్లాంట్లకు బదిలీ చేసిందన్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే కార్మికులపై చర్యలు తీసుకోవడం అన్యాయమని చెప్పారు. ఈ బదిలీలను నిలిపివేయాలని పలు విన్నపాలు, ఆందోళనలు నిర్వహించామని గుర్తు చేశారు. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బిస్లరీ మేనేజ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా అన్‌ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నదని విమర్శించారు. సంగారెడ్డి డీసీఎల్, జేసీఎల్, కమిషనర్ ఆఫ్ లేబర్ ఎందుకు యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లేబర్ కోడ్‌లు పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదని, కార్మిక శాఖ నియమాలు కూడా ఇంకా ఆమోదం పొందలేదని, పాత కార్మిక చట్టాలు అమల్లో ఉన్నప్పుడే ఈ పరిస్థితి వచ్చిందంటే, రాబోయే రోజులు ఎంత భయకరంగా ఉంటాయోననే ఆందోళన కలుగుతోందన్నారు.
కార్మికులు 22 రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంటనే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను ఆదుకోవాలని, సమస్యను పరిష్కరించేందుకు లేబర్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్ మాట్లాడుతూ దేశంలో బిస్లరీ కంపెనీల్లో ఎక్కడా యూనియన్ లేదని, సంగారెడ్డి జిల్లాలో కూడా యూనియన్ ఉండదని, దానిని గుర్తించబోమని యాజమాన్యం చెప్పడం కార్మిక చట్టాల ప్రకారం నేరమన్నారు.
లేబర్ కమిషనర్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు కార్మికుల పక్షమో, యాజమాన్యాల పక్షమో తేలిపోతోందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ మాట్లాడుతూ బిస్లరీ కార్మికులు అనేక రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టినా యాజమాన్యం బరితెగించి వ్యవహరిస్తోందని విమర్శించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకొని సమ్మెకు పరిష్కారం చూపేందుకు కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు భానుకిరణ్, రాజయ్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్, నాగరాజు,కృష్ణకుమార్, అజయ్, సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.



