యుద్ధం ఓ వికృతం. ఓ వినాశకరం. ఓ ప్రమాదకరం. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలోని అత్యున్నత రూపమే సామ్రాజ్య వాదం అని కామ్రేడ్ లెనిన్ ఏనాడో వక్కాణించాడు. దేశ దేశాలలోని శ్రామిక సంపదను, ప్రకతి సిద్ధ సహజ వనరులను కొల్లగొట్టేందుకే సామ్రాజ్య వాదం తన భయంకర మారణాయుధాలతో ఆయా దేశాలపై యుద్ధ దాడులకు దిగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో ఇరాన్‌పై చేస్తున్న క్రూర ఆకృత్యం అదే. దీనికితోడు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు జాతి హననం (జినోసైడ్) పేరుతో పాలస్తీనా (గాజా)పై దుర్మార్గ దాడులకు పూనుకుంటున్నాడు. ఈ ఇరువురూ 21వ శతాబ్దపు నరహంతకులుగా గణతికెక్కారు. మనిషి కనీస అవసరాలు తిండి, బట్ట, వసతి అని మనం మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. ఈ మూడింటితోపాటు మరో నాలుగు కనీస అవసరాలను ఐక్యరాజ్యసమితి చేర్చింది. అవి -విద్య, వైద్యం, నీరు, ఇంధనం (విద్యుత్, చమురు వగైరా). ఇపుడు ఈ ఏడు ఆధునిక మానవుని కనీస అవసరాలుగా చలామణి అవుతున్నాయి. ప్రతి దేశం ఆయా దేశాల ప్రజలకు వీటిని సక్రమంగా అందించి వారి జీవన విధానానికి పాటుపడటమే పాలకుల బాధ్యత.
వీటితోపాటు శాంతిని కూడా ఓ కనీస ప్రజా అవసరంగా చేర్చాలని శాంతి కాముకులు, మానవ హక్కుల కార్యకర్తలు నేడు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిజమే మానవాళి మనుగడకు, అభివృద్ధికి ‘శాంతి’ అనివార్య అవసరమని వేరుగా చెప్పక్కర్లేదు. కానీ సామ్రాజ్య వాదం తన దోపిడీని యధేచ్ఛగా సాగించాలంటే యుద్ధాలు అనివార్యంగా చేయాల్సిందే. యుద్ధాలు చేయాలంటే ఎప్పటి కప్ప్పుడు అధునాతన మారణా యుధాలు సృష్టించు కోవా ల్సిందే. అణుబాంబులు, జీవ రసాయన బాంబులు ఈ కోవలో ఉత్పత్తి అయినవే. వీటిని ఎప్పటికప్ప్పుడు కొత్తగా ఉత్పత్తి గావించేందుకు అమెరికాలో మిల టరీ ఇండస్ర్టియల్ కాంప్లెక్స్‌లు (సైనికాయుధ ఉత్పత్తి కర్మాగార సముదాయాలు) పెద్దఎత్తున కృషి చేస్తూ ఉంటాయి. అపర కుబేరులు వీటిని నిర్వహిస్తుంటారు. వీరి కనుసన్నల్లోనే అమెరికా రాజ్యం నడుస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఈ పాలకవర్గాల యుద్ధోన్మాదం వలనే సామాన్య ప్రజల్లో కూడా తెలియకుండానే హింసోన్మాదం పెరిగి పోతున్నది. దోపిడీ ఎంత సహజమో, యుద్ధదాడులూ అంతే సహజమూ అన్న భ్రాంతిని కలగజేస్తారు. ఈ నేతలు దేశాల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య కావాలని ఆ విధంగా విద్వేషాలు రెచ్చ గొడ్తుంటారు. దాంతోనే తమ అధికార పబ్బం గడుపుకుంటారు.
ఈ వికృత యుద్ధోన్మాద చర్యల వలన మరో పక్క నిష్కారణంగా అమాయక ప్రజలు బలైపోతుంటారు. గత కొంత కాలంగా ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్న యుద్ధదాడుల్లో దాదాపు డెబ్బయి వేల మంది ప్రజానీకం చనిపోయినట్టు అంచనా. మరో లక్షమందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో సింహభాగం స్ర్తీలు, పిల్లలు ఉన్నారంటేనే యుద్ధోన్మాదులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది. అసలు పాలస్తీనా బావిపౌరులను అంటే పిల్లలను సమూలంగా నాశనం చేయాలనే దుష్టతలంపుతోనే ఆ యుద్ధదాడులు సాగినట్టు జస్టీస్ మురళీధరన్ తెలపడం విస్మయం కలిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నియమించిన విచారణ కమిషన్‌కు ఆయన సారథి. ఆ కమిషన్ సమర్పించిన నివేదికలో ఎన్నో భయంకర విషయాలు బయట పడ్డాయి.
యుద్ధదాడి మొదలై దాదాపు ఈ రెండున్నరేండ్ల కాలంలో ఇరవై వేలమందికిపైగా పిల్లలు చనిపోయారని, 44 వేలమంది పిల్లలు గాయపడ్డారని కమిషన్ తెలిపింది. 2025లో పాలస్తీనా హమాస్‌కు – ఇజ్రాయిల్‌కు మధ్య కాల్పుల ఒప్పందం జరిగిన తర్వాత కూడా గాజాలో పిల్లల సంహారమే ఒక పనిగా పెట్టుకుని ఇజ్రాయిల్ సైన్యం కృషిచేసింది. పిల్లల్ని చంపడానికి నరక ప్రాయ మైన చిత్రహింసలను చేపట్టింది. లైంగిక హింసకు పాల్పడింది.
అంతే కాదు, పిల్లలకు రక్షణగా నిలిచే వసతి గృహాలను, ఆస్పత్రులను, విద్యాలయాలను నేలమట్టం చేసింది. అమ్మ ఒడిలో పాలు తాగే పసిపిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగినట్టు రుజువులు కూడా ఉన్నాయి. పాలస్తీనాలో వారి జాతి జనాభా వృద్ధి కాకుండా వారి స్వయం నిర్ణయాధికారం హక్కును సమూలంగా తుడిచి పెట్టాలనే దురుద్దేశ్యంతోనే ఈ దాడులును ఇంకా కొనసాగిస్తున్నట్టు వివరించింది. ఇదే అదునుగా తీసుకుని ఆ భూ భాగంలోని చొరపడిన ఇజ్రాయిల్ సంపన్నులు గాజా భూ ఆక్రమణకు సిద్ధమవుతున్నారు. దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంతపాడుతూ గాజా ప్రాంతాన్ని పాలస్తీనియులు ఖాళీచేయాలని, ఆ ప్రాంతంలో అందమైన రిసార్టులు నిర్మించేందుకు తనతో చేతులు కలపాలని బిలీయనర్‌లకు పిలుపునిస్తున్నాడు. ఎంతటి అమానుషం? ఎంతటి దౌర్జన్యం? అందుకే గాజాలో యుద్ధదాడులను ఇజ్రాయిల్ తక్షణం నిలిపివేయాలని ఆ కమిషన్ తేల్చి చెప్పింది. పిల్లలపై దాడులకు పాల్గొన్నవారిని నేరస్తులుగా భావించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
ఇంతటి దుర్మార్గ యుద్ధ చర్యలకు పాల్పడిన సైనికాధికారుల రాకపోకలను, ఆర్థిక వ్యవహారాలను నియంత్రించాలని కోరింది. ఇజ్రాయిల్‌తో సైనికపరమైన వాణిజ్యంపై సంపూర్ణ నిషేధం విధించాలని కూడా కమిషన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో యుద్ధోన్మాద ముద్దాయిలుగా నెతన్యాహు, ట్రంప్‌లున్నట్టు యావత్ ప్రపంచానికి ఈ నివేదిక ద్వారా మరోసారి వెల్లడైంది. అలాంటి నరహంతక నెతన్యాహుని మన ప్రధాని మోడీ ఫిబ్రవరి చివరిలో అక్కడికి వెళ్లి కలుసుకుని, కౌగలించుకుని, ‘భారత్ మాకు మాతృభూమి అయితే ఇజ్రాయిల్ మాకు పితృభూమి’ అని వాక్రుచ్చారు. ఇదేం సంస్కృతి? ఇదేం నాగరికత? అని నెటిజన్లు మండిపడ్డారు. భారత ప్రజలకు ఇది ఘోర పరాభవం అంటూ దుమ్మెత్తి పోశారు. అలాగే నరహంతక ట్రంప్ యుద్ధోన్మాదాన్ని పల్లెత్తి ఖండించకుండా మౌనంగా ఉండటాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. మరి ఇలాంటి ప్రధాని నేతృత్వంలో మన భారతదేశం శాంతి కాముక దేశంగా విరాజిల్లు తుందా? శాంతి మానవాళి కనీస (ప్రాథమిక) అవసరంగా, హక్కుగా వర్థిల్లుతుందా..? అనేది నేటి మిలియన్ డాలర్ల ప్రశ్న.
కె.శాంతారావు, 9959745722



