నియామకాలు లేక అవస్థలు
40 శాతం పోస్టుల ఖాళీ
ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది లేమీ
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి
రూ.18 వేల కోట్ల పనులపై తీవ్ర ప్రభావం
బి.బసవపున్నయ్య
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఒకవైపు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నది. అదే సందర్భంలో వాటిని పర్యవేక్షించాల్సిన సీనియర్ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది నియామకాలను మరిచిపోతున్నది. తత్ఫలితంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఆయా ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా తయారయ్యాయి. కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ), మల్కాజిగిరి(ఎంఎంసీ), సైబరాబాద్ (సీఎంసీ) 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడింటిలో సుమారు రూ.18 వేల కోట్ల అంచనా వ్యయంతో స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసు బ్రీడ్జీలు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. 2024లో ప్రారభమయ్యాయి. 2027 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. అయితే వాటి పర్యవేక్షణకు అవసరమైన ఉన్నత స్థాయి ఇంజినీరింగ్, అధికార యంత్రాంగం లేకపోవడంంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కార్పొరేషన్లలో అధికారులు, ఇంజినీర్లు లేక కార్యాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. 3 కార్పొరేషన్లకు మెట్రో రైలు వెన్నెముకలాంటిది. ఎస్‌ఆర్‌డీపీ ప్లైఓవర్లు, ఎస్‌ఎన్‌డీపీ నాలాలు, 24 గంటల నీటి సరఫరా వాగ్ధానం ఇంకా అమల్లోకి రానేలేదు. ఇప్పటికీ తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి.
పనులు భారీగా… అధికారులు మాత్రం అరుదుగా
ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం ఐదు ప్యాకేజీల్లో 23 కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో వీటిని చేపట్టారు. కాగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అధికారులు, సీనియర్ ఇంజినీర్ల కొరత ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రభావం చూపిస్తున్నది. ఎంఎంసీలో గత జూన్‌లో సూపరింటెండింగ్ ఇంజినీర్లు పదవీ విరమణ చేశచాు. సీఎంసీలో ఒకరు రిటైరయ్యారు. జీహెచ్‌ఎంసీలోనూ ఓ కీలక అధికారి ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో మూడు కార్పొరేషన్లలో సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు లేక పనులు మరింత జాప్యం అయ్యే అకావశం ఉంది. కొండాపూర్ లో రూ.420 కోట్ల ఫ్లైఓవర్ పిల్లర్ పనులు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలో రూ.380 కోట్ల ఎస్‌ఎన్‌డీపీ నాలా తొవ్వుతున్నారు. మల్కాజిగిరిలో రూ. 210 కోట్ల వాటర్ పైపులైన్ వేస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో 52 ఏఈ పోస్టులకు 19 మంది మాత్రమే ఉన్నారు. సైబరాబాద్ ఇంజినీరింగ్‌లో 40 శాతం జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్కాజిగిరి శానిటేషన్ విభాగం 2800 మందికి ఒక స్వీపర్ అందుబాటులో ఉన్నట్టు సమాచారం.
అయితే 500 మందికి ఒకరు ఉండాలనేది నిబంధన.
సీఎంసీలో ఎస్‌ఈలే లేరు… ఎంఎంసీలో ఒక్కరే
ప్రస్తుతం సీఎంసీలో సూపరింటెండింగ్ ఇంజినీరింగ్ స్థాయి అధికారి ఒక్కరు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఎంఎంసీలో సైతం ఒకే ఒక్క అధికారి మిగిలారు. కిందిస్థాయిలో సీఈలు, డీఈలు, ఏఈలు ఉన్నప్పటికీ, భారీ ప్రాజెక్టుల ఆమోదాలు, సాంకేతిక నిర్ణయాలు, పర్యవేక్షణ వంటి అంశాల్లో సీనియర్ అధికారుల అవసరం కీలకం. సాంకేతికంగా క్లిష్టమైన స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ బ్రీడ్జీల నిర్మాణంలో ప్రతీ దశలో అనుభవజ్ఞులైన ఇంజినీర్ల పర్యవేక్షణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఉన్న వారిపై విపరీతమైన పనిభారం పెరిగి ఇంజినీరింగ్ అధికారుల్లో అసంతృప్తికి కారణమవుతున్నది.
సీఎం వద్దే మున్సిపల్ శాఖ …
మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షి స్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను వేగంగా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, శాఖ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ లోపిస్తున్నది. దీంతో ఉన్నతాధికారులే వ్యవస్థను నడిపిస్తున్నారనీ, క్షేత్రస్థాయి సమస్యలపై సమగ్ర దృష్టి కొరవడిందని అధికారులే సెలవిస్తున్నారు.
తగ్గిన క్షేత్రస్థాయి పర్యటనలు
ఈ మూడు కార్పొరేషన్లలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఆయా కార్పొరేషన్ల కమిషనర్లు ఉదయాన్నే వార్డుల పర్యటనలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. కమిషనర్లు ఆశించిన మేరకు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనల కంటే సమావేశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డ్రయినేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి రోజువారీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖాళీ పోస్టులెందుకు..?
నియామకాలపై 2018-2023 వరకు నిషేధం కొనసాగించారు. టీఎస్‌పీఎస్సీ జాప్యం చేయడం, కోర్టు కేసులతో నియామకాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. జీహెచ్‌ఎంసీలో చివరగా 2017లో ఖాళీలను భర్తీ చేశారు. ఆరేండ్లల్లో 8,000 మంది పదవీ విరమణ చేయగా, కేవలం 800 మందిని మాత్రమే కొత్తగా నియమించారు. 2.శాశ్వత నియామాల్లేక డిప్యూటేషన్ పద్దతిలో నియమిస్తారు. ఆర్‌అండ్‌బీతోపాటు ఇతర శాఖల నుంచి 30 శాతం మేర ఈఈ, ఎస్‌ఈలను తెచ్చుకున్నారు. డిప్యూటేషన్ ముగియగానే వెళ్లిపోతుండటంతో సంస్థాగత అనుభవం పెద్దగా ఉండటం లేదు. స్వీపర్లు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 70 శాతం అవుట్‌సోర్సింగ్ నుంచే వస్తారు. నీతినిజాయితీగా పనిచేసే అధికారులు, ఇంజినీర్లను పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లు బదిలీ చేయిస్తారు.
ఇన్‌చార్జీల పాలనలో కార్పొరేషన్లు
జీహెచ్‌ఎంసీ నుంచి విభజించి మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెలలు గడుస్తున్నా ఇన్‌చార్జీల వ్యవస్థతోనే తంటాలు పడుతున్నారు. దీంతో ప్రాజెక్టులపై బాధ్యతాయుతమైన పర్యవేక్షణ, దీర్ఘకాలిక ప్రణాళిక, సాంకేతిక సమన్వయం వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనులకు శాశ్వత అధికారుల్లేక పరిపాలనా పరమైన లోపాలు బయట పడుతున్నాయి. పనుల్లో వేగం పెరగడం లేదు. వర్కింగ్ ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఒకింత ఆలస్యం చేస్తున్నారు. ఈ మూడు కార్పొరేషన్లకు స్పెషలాఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండటం గమనార్హం.
సిబ్బంది లేక అవస్థలు
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే కేవలం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. వాటిని అమలు చేసే బలమైన సాంకేతిక వ్యవస్థ, అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ అంతే కీలకం. ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా ఉంది. రూ 18 వేల కోట్లతో స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మిస్తున్న, వాటిని పర్యవేక్షించాల్సిన సీనియర్ ఇంజినీర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఎస్‌ఈలు వరుసగా పదవీ విరమణ అవుతుండగా, పూర్తిస్థాయి చీఫ్ ఇంజినీర్ల నియామకం జరగక మూడు కార్పొరేషన్లు ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నాయి.



