Monday, July 6, 2026
E-PAPER
Homeదర్వాజఅందరూ …

అందరూ …

- Advertisement -

అందరూ చనిపోయారు … ఎప్పట్నుంచో మృతులుగా ఉన్నారు …
మనం కేవలం వారి మాటలం. ఇంకా … దాక్కునేందుకు జాగాను
వెతికే ప్రయత్నం చేస్తున్న పదాలం. కాదు కాదు, సముద్రం ఒకప్పుడు
తొడుక్కున్న చర్మం మనం. ఆ చర్మం అతిగా పెరిగిపోగా ఏర్పడిన
చిన్న చిన్న పొలుసులం. కానీ అందరం ఏకమైతే మనం ప్రపంచాన్ని
కప్పేసే కవచం కాగలం. కాదు కాదు, కొవ్వొత్తి కలలు కాలిపోగా ఏర్పడిన
బూడిద మనం. కలలు అందమైనవి. నా కుటుంబం లోని కలల గురించి
చెప్పనీ. ఆ కలలు ఖరీదైనవి. వాటిలో కొన్నింటిని మేం మరిచిపోతాం.
కాదు కాదు, మౌనానికి ఉన్న మనగలిగిన శక్తిని తెలుసుకుని దానితో
పోరాడుతున్న నాలుకలం మనం. రూపకం మన అత్యంత విశ్వసనీయమైన
ఆయుధం. కానీ అది కూడా కుప్పకూలుతుంది. కాదు కాదు, మనం
చికిత్స తర్వాత తిరిగి వచ్చిన రోగులం. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం
మన హాస్పిటల్ బెడ్. (స్వచ్ఛందంగా లాన్ లోకి పోయిన మనం పొద్దున్నే
లేచివచ్చిన పక్షికి ఆహారమయ్యే పురుగులం. గదిలో దుస్తులు ఒకదానితో
ఒకటి మాట్లాడుకుంటుంటే అక్కడ ఒంటరిగా ఉన్న మనం వాటి మాటలను
వింటాం. ఆ సంభాషణలో మన పేరు ప్రస్తావనకు వచ్చి, షాక్ కు గురి
అవుతాం.) కాదు కాదు, భవిష్యత్తు మీదా దాని గొప్ప ప్రణాళికల మీదా
గతదినం ప్రసరించిన నీడలం మనం. సామగ్రి అంత పెద్ద పరిమాణంలో
పణంగా ఉన్నప్పుడు ఏదీ వాస్తవం కాదు. మనం కేవలం కోల్పోగలం.
అంతే … కాదు కాదు, మన శక్తియుక్తులు ఒక రాత్రి పేకాటలో గెల్చి
దాచుకున్న ఐశ్వర్యం మనం. మనం భూమి లోపల ఒక కుక్క వదిలేసిన
బొమికలం. ఆ కుక్క అప్పుడడప్పుడు ఆ భూమిని తవ్వుతుంది. చల్లని
మన చర్మం మీద ఎండ పడుతుంది. దాన్నే మనం దినం లేదా పగలు
అంటాం. కాదు కాదు, రాత్రి అనే నది ఎండిపోయినప్పుడు ధ్వంసమై
చెల్లాచెదరుగా తేలే శిథిల నౌక భాగాలం మనం. ‘నా దగ్గర ఓ
రహస్యముంది’ అనే వాక్యాన్ని చూపుతున్న పాత టీవీని నేను.
నువ్వేమో చేపల వాసన కొట్టే ఒక సోఫావు. కాదు కాదు, మనం
ఖాళీగా ఉన్న ఒక పెద్ద నాటకప్రదర్శనశాలలో ఉన్నాం. ఏదో ఒకనాడు
అందులో ప్రదర్శన జరుగుతుంది. వీక్షకుల కోసం అందులో చాలా సీట్లు
ఉన్నాయి. మనం సంగీత వాద్యపరికరాలం. మనం సౌందర్యాన్ని
వెలార్చేందుకు ఎంతో అవకాశముంది.
ఆంగ్లమూలం: Everyone (గ్రెగ్ కుజ్మా)
అనువాదం: ఎలనాగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -