ఫరీద్ ఖాన్ హిందీలో రాసిన ‘అప్నోంకే బీచ్ అజ్నబీ’ అనే స్వీయాత్మక కథనంను జెర్రీ పింటో “Stranger in My Own Land: A Muslim in India after 2014” అని ఇంగ్లీషులోకి అనువదించగా, దానిని ప్రముఖ పాత్రీకేయుడు ఎస్ వినయ్ కుమార్ “నా సొంత గడ్డపైనే నేనోక పరాయివాణ్ణి” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. దేశ ప్రయాణం ఏ వైపుగా సాగుతుందో తెలుసుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరు చదువతగినది పుస్తకం. పుస్తకంలోని ప్రధాన బలం సామాన్య ముస్లింల జీవితంలోని రోజువారీ కష్టాల చిత్రణ. ఇది “మైక్రోకాస్మ్” అంటే సూక్ష్మ ప్రతిరూపం. ఒక వ్యక్తి జీవితం ద్వారా మొత్తం సమాజంలోని ఒక మత సమూహం అనుభవించే దుస్థితిని చూపడం. వ్యక్తిగత అనుభవాలు వ్యవస్థాగత సమస్యలకు ప్రతిబింబాలు. రచయిత ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి నిరాకరణ, అవన్నీ వ్యవస్థ యొక్క లక్షణాలే తప్ప యాదృచ్ఛిక సంఘటనలు కావు. సాహిత్యం సమాజాన్ని విశ్లేషించడం ద్వారా కాకుండా సమాజాన్ని ప్రతిబింబించడం ద్వారా అర్ధం చేసుకుంటుంది. ఇది కేవలం వ్యక్తిగత ఆత్మకథ కాదు; ముగిసిన కథ అంతకంటే కాదు. ఇది జరుగుతున్న కథ.
ఇది ఫరీద్ ఖాన్ ఒక్కడి కథ కాదు, భారతదేశంలోని ముస్లిం మైనారిటీలు అనుభవించే వ్యవస్థాగత బహిష్కరణకు సజీవ సాక్ష్యం.2014 తర్వాతికాలంలో భారతదేశపు రాజకీయ వాతావరణంలో రచయిత తన స్వంత భూమిలోనే తనను తాను ఎలా “అపరిచితుడు”గా భావిస్తాడో వివరిస్తాడు. ఇది కేవలం మతపరమైన అసహనం గురించి వివరణ మాత్రమే కాదు, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, అణచివేతను సమర్థించే ఒక భావజాల వ్యవస్థ గురించి అవగాహనను కూడా తెలియజేస్తుంది. “ఎవరు భారతీయులో”, ఏది భారతీయతో” నిర్వచించే అధికారం ఒక సమూహానికి మాత్రమే ఉంది, ఆ నిర్వచనానికి సరిపోని వారందరూ “బహిష్కృతులు” అవుతారు. ఫరీద్ ఖాన్ తనను తాను బిహారీ అని పిలుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతని స్నేహితుడు అసంకల్పితంగా “హిందువులు మాత్రమే బిహారీలు” అని చెప్పడం ద్వారా ఇది వ్యక్తమైంది. ఇది కేవలం వ్యక్తిగతంగా రచయితకు జరిగిన అవమానం కాదు, అతని స్నేహితుడి వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఒక భావజాలపరమైన చర్య. ఇక్కడ “బిహారీ” అనే గుర్తింపు కూడా హిందూ మతంతో ముడిపెట్టబడింది, ముస్లింలకు ఆ గుర్తింపు నిరాకరించబడింది. అంటే ముస్లింలకు మత గుర్తింపు మినహా మరే గుర్తింపు ఉండటానికి వీల్లేదనేది వారి భావన.
ఈ విధమైన ఆలోచనలను సమాజంలోని అన్ని స్థాయిలలో “ఇంగిత జ్ఞానం” (common sense)గా మార్చింది ఆధిపత్య వర్గం. పుస్తకం 2014ను ఒక కీలకమైన మలుపుగా పేర్కొంటుంది. 2014లో రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకున్న వారి హిందూత్వ భావజాల రాజకీయ ప్రాజెక్ట్ గా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశ్యం ఆర్థిక సంబంధాలను పునర్నిర్వచించడం, అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా అమలు చేయడం. సామాజిక సంబంధాలను పునర్నిర్మించడం, అంటే కులం, మతం ఆధారిత గుర్తింపులను బలోపేతం చేయడం. ప్రతిఘటనను అణచివేయడం, అసమ్మతిని “దేశద్రోహం”గా ముద్రవేయడం. ఎనిమిది దశాబ్దాల క్రితం పాకిస్థాన్ అవలంబించిన విధానాలకు భిన్నంగా, ఉన్నతమైన ఆశయాలతో బయలుదేరిన మనం చివరికి హిందూత్వ ప్రాజెక్ట్ ఫలితంగా మరో పాకిస్తాన్ గా ఎలా మారుతున్నామో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ముస్లింలు నిరంతరం తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి, లేదంటే “పాకిస్తాన్ వెళ్ళండి” అనే బెదిరింపు, ఇది సామ్రాజ్యవాద భావజాలం యొక్క పునరుత్పత్తి. ఇక్కడ ముస్లిం అనేది “ఇతరులు” (the Others)గా మాత్రమే కాదు అంతర్గత శత్రువుగా నిర్మించబడుతున్నారు, అందుకే వారి ఉనికే ప్రశ్నార్ధకం! “పరాయీకరణ” (alienation) అనే భావనను కార్మికులు తమ శ్రమ ఫలితం నుండి విడిపోవడంగా మాత్రమే కాకుండా, మనిషి తన సారాంశం నుండి, తన సమాజం నుండి, తన స్వంత గుర్తింపు నుండి విడిపోవడంగా చూస్తాము.
అయితే మనిషి తనను తానే గుర్తించ లేకపోవడం అనేది పరాయీకరణకు పరాకాష్ట. రచయిత హిందీలో ఉపయోగించిన “అప్నోంకే బీచ్ అజ్నబీ” అనే పద బంధం అందుకు అద్భుతమైన వ్యక్తీకరణ. పుస్తకంలో “మౌనాలు, మాటలు”లో రైలు ప్రయాణాల గురించి చేసిన వర్ణన ఒళ్ళు జలదరించేలా చేస్తుంది. రైలులో మొబైల్ ఫోన్ మోగినప్పుడు “సలాం” అని చెప్పలేని పరిస్థితి. ఇది చాలా చిన్న విషయంగా కనిపించ వచ్చు, కానీ రోజువారీ జీవితంలోని ప్రతి క్షణంలో తనను తాను బలవంతంగా సెన్సార్ చేసుకోవడం ఎంత బాధాకరమైనదో ఆలోచించండి. రచయిత భార్య ట్రైన్ లో ప్రయాణిస్తున్న సందర్భంగా తన చుట్టూ ఉన్న వాళ్ళ సంభాషణలు విని తన సహజమైన ఉనికిని, తన భాషను, తన ఆచారాలను కూడా దాచుకొని బిక్కు బిక్కు మంటూ రాత్రంతా రైలులో గడిపిన అవస్థ ఎంత వ్యధాభరితమో కదా! ఆమె లోలోన ఎంత దుఃఖించి ఉంటుంది. అయితే రోదించడానికైనా స్వేచ్చ ఉంది. అందుకు అభినందనలు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? తన స్నేహితుల నుండి “నీ పూర్వీకులంతా హిందువులే” అనే మాటలు వినడం అనేది ఏదో యదాలపంగా చేసిన సాధారణ సూత్రీకరణ కాదు, ఇది చరిత్రను తిరగరాసి, గుర్తింపును తుడిచివేసే వక్రీకరణ.
తరతరాల కింద మీ తాత, ముత్తాతలు దళితులుగా, శూద్రులుగా మా కాళ్ళ కింద బతికిన వారే, మతం మారినంత మాత్రానా మాతో సమానంగా ఎలా అవుతారని? అలా కానివ్వమనే ఒక హెచ్చరిక ఇందులో నిగూఢంగా ఉంది. ఒక నిర్దిష్ట వర్గం యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా చరిత్రను మార్చడంగా దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకంలో మతం యొక్క మరో కోణం గురించి కూడా వివరణ ఉంది. సాధారణంగా మతం ఆ మతాన్ని అవలంబించే వారిని అణిచి వేయడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ ఈ పుస్తకంలో మతం అనేది అణచివేతకే పరిమితం కాదు, అణచివేతను సమర్థించే సాధనంగా కూడా మారిందనే అంశాన్ని ఎత్తి చూపింది. హిందూత్వ ప్రాజెక్ట్ విస్తృతంగా అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అణగారిన తరగతుల ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు అనేక రేట్లు పెరిగిన విషయం మనం చూస్తూనే ఉన్నాము. ఇది సొంత అనుయాయులపై మత అణిచివేతకు నిదర్శనం అయితే, ముస్లింల “టోపీ, గడ్డం, రోజూ ఐదు సార్లు నమాజ్, గోమాంసం, హిందువును పెళ్లి చేసుకోవడం” వంటి ప్రతి పనికీ కఠినమైన పర్యవేక్షణ. ఇక్కడ మతం అనేది వ్యక్తిగత విశ్వాసం కాకుండా ప్రజా పర్యవేక్షణలో ఉండే ఒక గుర్తింపుగా మారింది. ఇది “జీవన విధానం” (mode of life) పై ఆధిపత్య వర్గం విధించిన నియంత్రణగా, దాడులకు లభిస్తున్న సమర్ధనగా ఉంది. మతం అణిచివేతను సమర్ధించే సాధనంగా మారిందనేందుకు నిరూపణ.
నసీరుద్దీన్ షా తన ముందుమాటలో అడిగిన ప్రశ్న “ఈ విషం ఎక్కడి నుండి వచ్చింది? విభజన సమయంలో నాటిన విద్వేషపు విత్తనాలు నెమ్మదిగా మొలకెత్తుతున్నాయా?” అనేది. మొలకతడం కాదు వృక్షాలుగా మారి ఫలాలను అందిస్తున్నాయి. అదే ఈ విశ్లేషణకు సరైన ప్రారంభ బిందువు. విభజన అనేది కేవలం మతపరమైన విభజన కాదు, ఇది బూర్జువా వర్గాల మధ్య ప్రాంతాల విభజన, సామ్రాజ్యవాదం కుట్రపూరితంగా చేసిన ఒక రాజకీయ ఒప్పందం. దాని ఫలితంగా మైనారిటీలు నిరంతరం అనుమానం కింద జీవించాల్సి వస్తోంది. ఈ పుస్తకం “భారతీయ ముస్లిం అనుభవం”ను డాక్యుమెంట్ చేయడమే కాకుండా, “ఏమి జరుగుతుందో” చూసేందుకు మన కళ్లను తెరిపిస్తుంది. పుస్తకంలో పరిస్థితి వివరణ మాత్రమే కాదు, పరిస్థితిని మార్చడానికి, మౌనాన్ని ఛేదించడానికి, “పరాయి” అనే ముద్రను ధిక్కరించడానికి ఒక ఆహ్వానం కూడా ఉంది. సమస్య ఎంత చిన్నదైనా, పెద్దదైనా ఎదురునిలిచి పరిష్కరించుకోవడమే సరైన మార్గం తప్ప, పారిపోవడం పరిష్కారం కాదు.
ఏ అణచివేత వ్యవస్థ అయినా దాని స్వంత వ్యతిరేకతను తానే సృష్టించుకుంటుంది.
ఈ పుస్తకం కూడా ఆశను చిగురింపచేసే అలాంటి విషయాలను అందిస్తుంది. అవి ఎలాంటి వంటే “నిశ్శబ్దం మధ్యలో మాటను కనుగొనడం”, “ఒంటరితనం మధ్యలో సమాజాన్ని కనుగొనడం”. రెండు సంవత్సరాల తర్వాత పుస్తకం చివరలో చేర్చిన భాగములో ‘వేకువ పొద్దు’ కోసం ఎదురుచూసే ప్రతీకను ఎంచుకోవడం ద్వారా రచయిత ఈ ఆశావాహ దృక్పథాన్ని మరింత బలంగా ప్రదర్శించారు. నసీరుద్దీన్ షా చెప్పినట్లు “రాజ్యంలో ఏదో ఖచ్చితంగా కుళ్ళిపోతోంది…” ఈ కుళ్ళిపోవడాన్ని గుర్తించడమే మొదటి అడుగు, దాన్ని సరిచేయడానికి పోరాడటం తదుపరి అడుగు. ఆ పోరాటంలో ఫరీద్ ఖాన్ పుస్తకం ఒక ఆయుధం, అయితే అది మృదువైనది, కానీ పదునైనది.
మహమ్మద్ అబ్బాస్
9030098032



