Sunday, July 5, 2026
E-PAPER
Homeదర్వాజరాయలనాటి కథలు - గాథలు

రాయలనాటి కథలు – గాథలు

- Advertisement -

తెలుగువారి చరిత్రలో స్వర్ణయుగం రాయల పాలనా కాలం. కృష్ణదేవరాయల గురించి మనం చర్చించుకునేటప్పుడు రాయలవారి గురించి నిజాలు మనకు తెలిసింది తక్కువ, కల్పితగాధలే ఎక్కువ అనిపిస్తుంది. అందుకని పరిశోధకుడు డాక్టర్ జి వి పూర్ణచందు గారు చారిత్రిక ఆధారాలు, సాహిత్యాధారాలు, ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలను అన్నింటిని క్రోడీకరించి – హేతుబద్ధంగా, తార్కికంగా వాటిని విశ్లేషించి నిగ్గుదేల్చి ఈ వ్యాసాలను రూపొందించారు. ఆముక్తమాల్యద వ్రాయాలనే సంకల్పాన్ని ఆంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలిగించాడట. రాయలవారికి దర్శనం ఇచ్చిన ఆంధ్ర మహావిష్ణువు రూపాన్ని రాయలవారు వర్ణించారు. అసలు ఆంద్ర మహావిష్ణువు ఎవరా అని ఇతర ప్రాంతాలు, ఇతర భాషలలో వెతికి బౌద్ధ జాతక కథల ఆధారంగా వారి ఉనికిని పరిశోధకుడు ధృవీకరించారు. చివరకు కౌండిన్య సుచంద్రుడి పుత్రుడైన ఆంధ్రమహావిష్ణువు కథలో కనిపించే ఆంధ్ర విష్ణువు అనే రాజు తెలుగుజాతి ప్రతిష్టను ఇనుమడింపజేసి, అనేక జాతులుగా జీవిస్తున్న ప్రజలందరినీ ఏకం చేసి భాష పరంగా తెలుగువారు గాను, జాతి పరంగా ఆంధ్రులుగాను తీర్చిదిద్దారని “రాయలవారు ఆరాధించిన ఆంధ్రవిష్ణు కథ” లో తెలియజేశారు.

తెలుగు నేలపైన వజ్రాల గనులు, హంపీ వజ్ర సంపద, రాయల కాలంలో వజ్రగనుల నిర్వహణ, గనులకు ప్రైవేటు యాజమాన్యాలు ,ప్రజల వజ్రాల అంగళ్లు ,కొండపల్లి వజ్రాలు, రాయల అనంతరం తెలుగు వజ్రాలు, గోల్కొండ వజ్రాల గనులు, తెలుగు వజ్రాలకే డిమాండుల గురించి చెబుతూ , “రాయలనాటి వజ్రాల పరిశ్రమ -అనంతర పరిణామాల” గురించి చేసిన అధ్యయనాన్ని ఆసక్తికరంగా వివరించారు. విజయ నగర కాలంలో వివిధ ప్రభుత్వాధికారులకు ,వారి విధులకు విధించిన పనులకు, ఇంకా అనేక పాలనాంశాలకు సంబంధించిన పరిభాషలో తెలుగుదనం పరిమళించడమే కాదు నేటి అవసరాలకు ఉపయోగిస్తుందని “రాయలనాటి పాలనా భాష” లో తెలియజేశారు. తిమ్మరుసు జననం, మంత్రివర్గంలో తిమ్మరుసు, రాయలవారి జననం, రాయలవారి ఇంటి పేరు, పట్టాభిషేకానికి ముందు, కృష్ణరాయల మరణం, తిరుమలలో తిమ్మరుసు శేష జీవితం గురించి చెబుతూ జనసామాన్యంలో ఉన్న మేక కళ్ళ కథలో నిజం లేదని తేల్చేశారు. కృష్ణరాయల అల్లుడు అళియ రామరాజు కుటుంబీకులమని, అనేగొంది రాజ్యాన్ని తమ పూర్వికులు నిలబెట్టారని, చంద్రగిరిలో విజయనగర సామ్రాజ్యం అంతరించిపోవడంతో నిజాం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం తమనే విజయనగర సామ్రాజ్యవారసులుగా భావించారని రాజా అచ్యుతదేవరాయలు తెలియజేశారు.

స్వాతంత్ర్యం వచ్చాక కూడా అనెగొంది సంస్థానాధీశుడిని హంపీ విజయనగర వారసుడిగా గుర్తించి భరణం కొనసాగించారు. 1984 వరకు ఆ కుటుంబానికి భరణం కొనసాగింది. హంపి ఉత్సవాలకు ఆనాటి అనెగొంది పాలకుడు కృష్ణదేవరాయలను ప్రారంభకుడిగా ఆహ్వానించి గౌరవించారు. ఆయన తరువాత అచ్యుతదేవరాయలు తండ్రి స్థానంలో ప్రతిష్ఠుడయ్యారు. ఆయన ఆనెగొంది లోని తమ వంశవృక్షం ఫోటో కాపీని పరిశోధకుడికి అందజేయగా, దాని ఆధారంగా వారు తమ విశ్లేషణను కొనసాగించారు. “తిమ్మన -పెద్దన- రాయలు” వ్యాసంలో రాయలవారి దిగ్విజయ యాత్రకు సాహిత్యధారాలు అనేకం ఉన్నాయని చెబుతూ- నంది తిమ్మన్న గారి పారిజాతాపహరణం, అల్లసాని పెద్దన్న గారి మనుచరిత్ర, రాయలవారి ఆముక్తమాల్యద వాటి రచనా కాలాల ఆధారంగా ,వారి దండయాత్రల గురించి తెలియజేశారు.. మొత్తం మీద రాయలవారి గురించిన కథలు ఆయన చరిత్ర కలగాపులగం అయి, నిజాలు జల్లెడకు దొరక్కుండా పోతున్నాయి.”మోహనాంగి” శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె అనేందుకు ఒకే ఒక సాక్ష్యం ఆమె వ్రాసిన మారీచీ పరిణయం కావ్యం. ఆమె చిత్రకారిణి కూడా.

సంస్కృతాంధ్ర భాషల్లో మంచి ప్రవేశం కలిగిన కవయిత్రి. తర్వాత కాలంలో మోహనాంగి పేరు, ఉనికి, కావ్యం మీద వచ్చిన వివాదాలను వివరించారు. ఒకవేళ మోహనాంగి పేరుతో ఎవరైనా ఈ కావ్యాన్ని కూటసృష్టి చేశారనుకున్నా, అది కూడా 400 ఏళ్ల క్రితమే జరిగి ఉండాలి. ఇటీవలి కవి ఎవరో కల్పించినదిగా భావించడం కూడా తొందరపాటే అనిపిస్తుంది అంటారు. అలాగే ‘కృష్ణరాయ విజయము’ రాసిన కుమార ధూర్జటి (ధూర్జటి గారి మనవడు) రాయలు పెళ్లాడిన గజపతి కూతురు పేరు తుఖ్ఖాజి అని, రాయబాచకంలో జగన్మోహిని అని, టైలరు దొర రుచీదేవి అని ,కొన్ని విజయనగర కడితాల్లో లక్ష్మీదేవి అని, ‘నరపతి రాజుల చరిత్రం’ లో లూఖా దేవి అని, నాదిండ్ల గోప మంత్రి ప్రబోధ చంద్రోదయంలో సుభద్ర అని వ్రాశారు. ఇంతకు తుఖ్ఖాజీ అనే వ్యక్తి ఎవరు? అసలు వారు ఉన్నారా, లేదా? అన్న చర్చ తో నిగ్గు తేల్చడానికి ఈ వ్యాసంలో ప్రయత్నించారు. “ఆముక్తమాల్యద లో ఆహారం” అంటూ వేసవికాలం, వానాకాలం, శీతాకాలంలో తీసుకునే ఆహారాల గురించి తెలియజేయడంతో పాటు, రాయలవారికి ఇష్టమైన ఆహారం ఆహార పదార్థాల గురించి ఈ వ్యాసంలో వివరించడం బాగుంది.

అలాగే ఆముక్తమాల్యదని చేత్తో పుచ్చుకుంటే 500 ఏళ్ల నాటి తెలుగు గ్రామాలలోని సాంఘిక జీవనం యావత్తు మన అరచేతిలోకి వస్తుంది అని ఇంకో వ్యాసంలో తెలియజేశారు. గతంలో వచ్చిన సాహిత్య చరిత్రలలో, జనసామాన్యంలో వాడుకలో ఉన్న అష్టదిగ్గజాల పేర్లను గురించి చర్చిస్తూ, ఆనాటి ఆస్థానంలో ఉన్న కవుల గురించి తెలియజేశారు “రాయలనాటి బెజవాడ, రాయల వారి తాంబూలాల కథ, రాయలవారి దసరా ఉత్సవాలు “అంటూ రాసిన వ్యాసాలలో మంచి సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషిస్తూ పాఠకులకు అందజేసిన విధానం బాగుంది. ప్రామాణికమైన ఆధారాలతో శ్రీకృష్ణదేవరాయల చరిత్రను నిగ్గు దేల్చి వివరంగా రాసిన చారిత్రిక వ్యాసాల సంపుటి ఇది. సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా రూపొందిన ఈ పుస్తకం చారిత్రిక పరిశోధకులకే కాదు. సాహిత్య పాఠకులు కూడా తప్పకుండా చదవదగినది.

కె.పి.అశోక్ కుమార్,
9700000948

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -