Monday, July 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీమా పేరుతో కార్మికుల సొమ్ము స్వాహా ?

బీమా పేరుతో కార్మికుల సొమ్ము స్వాహా ?

- Advertisement -

‘ప్రయివేటు’కు ఇన్సూరెన్స్ బాధ్యతలు చోద్యం చూస్తున్న లేబర్‌ ‌డిపార్ట్‌‌మెంట్‌
ఇప్పటికే చట్ట విరుద్ధంగా నిధుల మళ్లింపు మళ్లీ అదే తంతు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి

ఎస్ వెంకన్న
‘కార్మికుల సంక్ష‍ేమానికి మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతినిస్తోంది. వారికి సామాజిక భద్రత, బీమా, ఆరోగ్య రక్ష‍ణ కల్పించేలా చర్యలు చేపట్టాం…’ కార్మిక శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. కానీ ఆయన మాటలకు, ప్రభుత్వ చేతలకు పొంతన లేకుండా పోయింది. భవన నిర్మాణ కార్మికుల సంక్ష‍ేమం విషయంలో కొనసాగుతున్న తతంగమే దీనికి ప్రత్యక్ష‍ నిదర్శనం. వారికి చెందాల్సిన నిధులు దారిమళ్లుతున్నాయి. అయినా ఇటు ప్రభుత్వం, అటు కార్మికశాఖ చోద్యం చూస్తున్నాయే తప్ప దీనికి అడ్డుకట్ట వేయకపోవటం గమనార్హం. గతంలో ఇలాంటి తంతే జరగ్గా.. మరోసారి అలాంటి అవకతవలకే ఉన్నతాధికారులు ఆస్కారమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు భవన నిర్మాణ కార్మికుల ‘సెస్‌’నిధిని మరోసారి స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికులకు ఇన్సూరెన్స్‌ ‌సౌకర్యం కల్పించేందుకు గతేడాది జూలై 24న క్రెడిట్‌ ‌యాక్సెస్‌ ‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ అనే రెండు ప్రయివేటు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఈనెల 24 నాటికి ఈ ఒప్పందానికి ఏడాది పూర్తవుతుంది. అయితే ప్రభుత్వ రంగంలో అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను కాదని, మరోసారి కూడా ఈ పాత కంపెనీలకే ఇన్సూరెన్స్‌ను అప్పజెప్పబోతున్నారని సమాచారం. గవర్నమెంట్‌ ‌సెక్టార్‌‌లోని ప్రతిష్టాత్మక సంస్థలను కాదని.. ప్రయివేట్‌ కంపెనీలకే ఇన్స్యూరెన్స్‌‌ను బాధ్యతలను అప్పగించేందుకు సర్కార్‌ ఎందుకు పట్టుబడుతున్నది? అనే అంశాన్ని పరిశీలిస్తే… పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవంగా గతేడాది టెండర్‌ ‌ప్రక్రియలో ట్రెయిల్‌ బ్లేజర్‌తో కలిపి ఏడు బ్రోకర్‌ కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. ఆ ఏడింటిలో క్రెడిట్‌ ‌యాక్సెస్‌ ‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నాయి. విచిత్రమేమంటే.. ఆ ఏడు కంపెనీలు కూడా ట్రెయిల్‌ బ్లేజర్‌కి చెందినవే. ఒకే వ్యక్తి ఆయా కంపెనీల వెనకుండి బిడ్డింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. ఇతర ప్రయివేటు బీమా కంపెనీల టెండర్లలోనూ ట్రెయిల్‌ బ్లేజర్‌ కంపెనీ ప్రతినిధులే ఈఎండీ కట్టి మరీ టెండర్‌ వేయించి ప్రక్రియను పూర్తిచేసినట్టు ఓ అధికారి తెలిపారు. ఆ రకంగా ఎలాంటి పరపతి లేని ‘క్రెడిట్‌ యాక్సెస్‌’ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రయివేటు ‌కపెనీలకే టెండర్‌ దక్కిందని ఆయన వివరించారు.

జీవో 12 ఎందుకు?
ఇదే సమయంలో జూలై 2న జీవో 12ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి బీమా కంపెనీలు ఎలాంటి మధ్యవర్తులు, బ్రోకరేజ్‌ కంపెనీలు లేకుండా ప్రభుత్వానికి నేరుగా కొటేషన్లు సమర్పించవచ్చు. అందుకు భిన్నంగా ప్రభుత్వరంగ బీమా కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా, ప్రయివేట్‌ కంపెనీలకు నిధులను ధారపోయడానికి వీలుగా జీవో 12ను సర్కార్‌ ‌తీసుకొచ్చింది. ఈ జీవో పేరిట ప్రభుత్వ కంపెనీలకు పలు ఆంక్ష‍లను విధించటం ద్వారా…ఆయా సంస్థలు టెండర్లలో పాల్గొనకుండా అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ నియమ నిబంధనల ప్రకారం… సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించినవారే టెండర్లలో పాల్గొనెందుకు అర్హులు. కానీ సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించటమనేది ప్రభుత్వరంగ సంస్థల రూల్స్‌‌కు విరుద్ధం. ఫలితంగా న్యూ ఇండియా అసూరెన్స్‌, నేషనల్‌, ఓరియంటల్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఈ టెండర్‌కు దూరమయ్యాయని సమాచారం. దీంతో బీమా సొమ్ము ప్రయివేటుకు మళ్లింది. కార్మికశాఖ నిబంధనల ప్రకారం… భవన నిర్మాణ రంగానికి సంబంధించి…కార్మికుడి సాధారణ మరణానికి చెల్లించే పరిహారాన్ని రూ.లక్ష‍ నుంచి రూ. రెండు లక్ష‍ల వరకు, ప్రమాదాల్లో మరణించినప్పుడు ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్ష‍ల నుంచి రూ.10 లక్ష‍లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రయివేటు కంపెనీలు వాటిని అమలు చేయకపోయినా పట్టించుకునే నాథుడే లేకపోవటం గమనార్హం.

కార్మికుల డబ్బు దుబారా..
కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సంక్షేమబోర్డు వెబ్‌సైట్‌లో 53,940 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి క్లెయిమ్‌ల విలువ రూ.321.95 కోట్లు అని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అంటే ఈ లెక్కన వార్షిక సగటు చెల్లింపులు రూ.150 కోట్లు కూడా మించబోవని బీమా రంగ నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రయివేటు బీమా కంపెనీలకు ఒక్క ఏడాదికే రూ.346 కోట్లు కట్టబెట్టింది.‌ కేంద్ర చట్టం, రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డు నిబంధనలకు ఇది విరుద్ధం. దీన్ని బట్టే కార్మికుల డబ్బు ఎలా దుబారా అవుతున్నదో తెలుసుకోవచ్చు.

అటకెక్కిన సలహా మండలి
వంగూరు రాములు, ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ ‌కన్‌‌స్ర్టక్ష‍న్
వర్కర్స్‌ ‌ఫెడరేషన్‌(‌సీఐటీయూ)

మరోవైపు బీమా పరిహారాలు, చెల్లింపులపై ప్రభుత్వం నియమించిన సలహా మండలి అటకెక్కింది. ప్రభుత్వానికి అనుకూలమైన సభ్యులను ఆ కమిటీలో నియమించుకుని కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కటం దానికి రివాజుగా మారింది. 1996 భవన నిర్మాణ కార్మిక కేంద్ర చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర సంక్ష‍ేమ బోర్డు సలహా మండలిని ఎప్పటికప్పుడు నియమించాలి. దాని నిర్ణయం ప్రకారమే బోర్డు నిధులను ఖర్చు చేయాలి. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అది జరక్కపోవటం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా
నిధులను ఇతర శాఖలకు దారి మళ్ళిస్తున్నాయి. కార్మిశాఖ అధికారుల వాహనాలు, వారు వాడే ఖరీదైన ఫోన్లు, కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కార్మికుల సంక్షేమ నిధిని వినియోగించటం ఆనవాయితీగా మారింది. అందువల్ల ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని మరోసారి కొనసాగించకుండా జీవో 12ను రద్దు చేయాలి. ప్రభుత్వమే వెల్ఫేర్‌ ‌బోర్డు ద్వారా కార్మికులకు సంక్ష‍ేమ పథకాలు అందించాలి. పెండింగ్‌‌లో ఉన్న క్లయిమ్‌‌లకు నిధులు వెంటనే విడుదల చేయాలి. రెన్యూవల్‌ ‌కాని 13లక్ష‍ల మంది కార్మికుల లేబర్‌ ‌కార్డులను యుద్ధప్రాతిపదిక రెన్యూవల్‌ ‌చేయాలి. సలహా మండలిని వెంటనే నియమించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -