Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడిగడ్డలో నీరు నింపడం అసాధ్యం

మేడిగడ్డలో నీరు నింపడం అసాధ్యం

- Advertisement -

ప్రమాదమని ఎన్‌‌డీఎస్‌ఏ హెచ్చరించింది
పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
2027 లోగా కాళేశ్వరం 
మరమ్మతులు పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఈ ఏడాది నీరు నింపడం సాధ్యం కాదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘మూడు బ్యారేజీల ఫౌండేషన్‌లో లోపాలున్నాయని నిపుణులు తెలిపారు. నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుంది. భద్రాచలంతో పాటు దాదాపు 40 గ్రామాలు మునిగిపోతాయని ఇంజినీర్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ నాణ్యతతో నిర్మించి ఉంటే వినియోగించేందుకు మాకు అభ్యంతరం లేదు. బ్యారేజీల గేట్లు దింపే పరిస్థితి లేదు. నీరు నిల్వ చేయకుండా ఎత్తిపోయడం సాధ్యం కాదు’ అని ఉత్తమ్‌ ‌ఈ సదర్భంగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల కక్కుర్తితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని విమర్శించారు. ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయని భావించి చేసిన తప్పిదం ఉత్తర తెలంగాణకు శాపంగా మారిందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.1.81లక్షల కోట్లు ఖర్చు చేసి లక్ష‍ ఎకరాల ఆయకట్టుకు కూడా నీరివ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ సాగర్‌, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌‌బీసీ, నెట్టెంపాడు, డిండీ మొదలగు ప్రాజెక్ట్‌‌లన్ని అసంపూర్తిగానే ఉన్నాయని గుర్తు చేశారు.

తాము అధికారంలో వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వివరించారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు దండే’ అన్నట్టుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టింది కేసీఆర్ హయాంలోనే.. కూలిపోయింది కూడా ఆయన హయాంలోనే అని ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చారని ప్రస్తావించారు. కన్నెపల్లి పంపు ఆన్ చేసి నీరివ్వాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టును సరిగ్గా కడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ఇంజినీరింగ్ కోణంలో చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అత్యంత కీలక అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025 ఏప్రిల్‌ 24‌న కాళేశ్వరంపై ఎన్‌‌డీఎస్‌ఏ పూర్తి స్థాయి నివేదిక ఇస్తూ పలు సిఫారసులు చేసిందని మంత్రి గుర్తు చేశారు. అది చేసిన సూచనల మేరకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు వంటి అత్యాధునిక పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ పనులను పుణేలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), ఐఐటీ ముంబాయి, ఎన్‌‌డీఎస్‌ఏ, కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. భద్రతపై పూర్తి స్థాయి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొని పంపింగ్‌‌ను ప్రారంభిస్తామని తెలిపారు. అపోహలు సృష్టించే రాజకీయ ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ వద్ద కనిష్ట పాండ్ లెవెల్ లేకపోవడంతో కన్నెపల్లి పంపింగ్ అసాధ్యంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్‌న్లను ఖరారు చేసి, వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఆగస్టు 2027 నాటికి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల నీటిని తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను వేగవంతం చేసిందని చెప్పారు. డీపీఆర్ సిద్ధమవుతోందనీ, మహారాష్ట్రతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 2014 నుంచి నేటి వరకు… కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ‌అంచనాలు, సాంకేతిక అంశాలు, ఎన్‌‌డీఎస్‌ఏ రిపోర్ట్‌ తదితర అంశాలపై ఈఎన్‌‌సీ శ్రీనివాస్ అంతకు ముందు పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ఇచ్చారు. మీడియా సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్‌‌సీ రమేశ్‌‌బాబు, ప్రముఖ టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -