ఆగస్టు 10న దేశవ్యాప్తంగా
జులై నుంచి ఆగస్టు 10 వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు
గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజలను సమీకరణ
లక్నోలో ఎఐఎడబ్ల్యుయూ, సీఐటీయూ, ఎఐకెఎస్ సదస్సు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా “జైల్ భరో” నిర్వహించాలని ఎఐఎడబ్ల్యుయూ, సీఐటీయూ, ఎఐకెఎస్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడు సంఘాల సంయుక్త రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఎఐఎడబ్ల్యుయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఎఐకెఎస్ ఆర్థిక కార్యదర్శి కృష్ణ ప్రసాద్, ఎఐకెఎస్ జాతీయ సంయుక్త కార్యదర్శి బాదల్ సరోజ్, సీఐటీయూ నాయకురాలు వీణా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్త “జైల్ భరో”పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో నాయకులు మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనలో దేశ రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలు, లౌకిక విలువలు, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల హక్కులు తీవ్ర దాడికి గురవుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని అన్నారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్న విధానాలను దేశ ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు 10న జైల్ భరో ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి జులై నుంచి ఆగస్టు 10 వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రతి పంచాయతీ, ప్రతి పట్టణంలో గ్రామ సభలు, బహిరంగ సభలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, జాతాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ నిర్వహించాలని నిర్ణయించారు. ‘కార్మికులకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం అమలు చేయాలి. ఎనిమిది గంటల పనిదినం, ఓవర్‌టైంకు రెట్టింపు వేతనం చెల్లించాలి. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించి, కార్మిక సంఘ హక్కులను పరిరక్షించాలి. అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు చట్టబద్ధమైన ఎంఎస్‌పీ అమలు చేయాలి. రైతు పండించిన అన్ని పంటలకు ప్రభుత్వ కొనుగోలు గ్యారెంటీ (హామీ) కల్పించాలి. రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఎరువులు, విత్తనాలు, సాగునీటిని సకాలంలో అందించాలి. భారత వ్యవసాయాన్ని దెబ్బతీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టిఎ) రద్దు చేయాలి. కొత్త వీబీ గ్రామ్ జీ రద్దు, నిబంధనలను వెంటనే రద్దు చేసి, అసలు ఉపాధి హామీ చట్టాన్నిఎంజీఎన్ఆర్‌జీఈఎస్‌ను యథాతథంగా కొనసాగించాలి. ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలి. భూమిలేని గ్రామీణ పేదలకు సాగు కొరకు, ఇండ్ల స్థలాల కోసం భూమి పంపిణీ చేయాలి. ఆదివాసులు, దళితులు, మహిళా వ్యవసాయ కార్మికుల భూమి, జీవన హక్కులను పరిరక్షించాలి. విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
“జైల్ భరో” జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -



