Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసెప్టెంబర్ 27, 28న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు

సెప్టెంబర్ 27, 28న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు

- Advertisement -

హైదరాబాద్‌‌లోని సంతోష్‌నగర్‌లో
ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు

ఠానూ నాయక్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
250 మందితో ఆహ్వాన సంఘం ఏర్పాటు..
గిరిజన ఐక్యతకు మహాసభలు నాంది

నవతెలంగాణ-చార్మినార్/మలక్‌‌పేట్‌
తెలంగాణ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, పోరాట వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఐక్యతను చాటిచెప్పేలా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలు, ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌‌లోని సంతోష్‌నగర్‌లో నిర్వహించనున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని మలక్‌పేట్‌లో ఫెర్న్ హిల్స్ స్కూల్‌ (టీవీ టవర్ వెనుక)లో ఎం. ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 250 మందితో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదా యాలు క్రమంగా అంతరించిపోతున్న తరుణంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలు నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. లంబాడీ గిరిజనుల సంస్కృతి దేశానికే ఆదర్శమని, ఆ గొప్ప సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని పిలు పునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం దశాబ్దా లుగా గిరిజన హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తుందని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఠానూ నాయక్ వంటి మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమవుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తూ వారి సంస్కృతిపై దాడులు చేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్‌లోని 15 గిరిజన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ప్రతి గిరిజన కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం, ప్రతి తండా-గూడెం పంచాయతీకి ఏటా రూ.25 లక్షల ప్రత్యేక నిధులు, మైదాన ప్రాంతాల్లో ఐటిడీఏల ఏర్పాటు వంటి కీలక హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.​తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పాతనగరంలో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు, ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. గిరిజనుల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళాకారులు, సంస్కృతిక బృందాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రతి గిరిజన కుటుంబం ఈ మహాసభలను తమ సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని, గిరిజన ఉద్యోగులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు తమవంతు సహకారం అందించాలని కోరారు. 1999లో ఆవిర్భవించిన గిరిజన సంఘం గత 27 సంవత్సరాలుగా భూ సమస్యలు, అటవీ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమం తదితర అంశాలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించి పలు విజయాలు సాధించిందని వివరించారు.

250 మందితో ఆహ్వాన సంఘం
మహాసభల విజయవంతం కోసం 250 మంది గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మేధావులతో విస్తృత స్థాయి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వాన సంఘం చైర్మెన్‌‌గా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. రామచందర్ నాయక్, కో-చైర్మెన్‌‌గా డిప్యూటీ డీసీపీ (ట్రాఫిక్) రాందాస్ తేజా, అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం. బాలు నాయక్, కోశాధికారిగా రాంకుమార్ నాయక్, ఉపాధ్యక్షునిగా ఆంగోత్ కృష్ణా నాయక్, మీడియా అధ్యక్షునిగా జర్నలిస్ట్ సింగ్ ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు ఆహ్వాన సంఘంలో సభ్యులుగా కొనసాగనున్నారు. ​ఈ సమా వేశంలో ప్రొఫెసర్ శంకర్ నాయక్, ఆవాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ నాయక్, నాయకులు పీర్యా నాయక్, ఎం. బాలు నాయక్, రాంకుమార్ నాయక్, ఆంగోత్ కృష్ణా నాయక్, భూక్యా వీరభద్రం, గూగులోత్ భీమా సాహెబ్, ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, వివిధ జిల్లాల నుంచి గిరిజన నాయకులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -