Thursday, July 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువీబీ గ్రామ్‌ ‌జీరాష్ట్ర బడ్జెట్‌ ‌రూ.6,311 కోట్లు

వీబీ గ్రామ్‌ ‌జీరాష్ట్ర బడ్జెట్‌ ‌రూ.6,311 కోట్లు

- Advertisement -

ఈ ఏడాది లక్ష్యం 12 కోట్ల పనిదినాలు
నేటి నుంచి సర్పంచ్‌‌లు, కార్యదర్శులకు
3 రోజులపాటు శిక్ష‍ణ : పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
వీబీ గ్రామ్‌ ‌జీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.6,311 కోట్ల బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, వీబీ గ్రామ్‌ ‌జీ పథకం అమలు,16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్లు, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, ఇతర పంచాయతీ రాజ్‌ అధికారులతో ‌మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 కోట్ల పని దినాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో నెలకు కనీసం వెయ్యి పని దినాలు సృష్టించేలా కార్యాచరణ రూపొందించాలనీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించే దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ ‌శాఖలో నూతన విధానాలు, మార్గదర్శకాలపై సర్పంచులు, కార్యదర్శులు, ఇంజినీర్లు, సంబంధిత శాఖల అధికారులకు జులై 8 నుంచి 10 వరకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో మాస్టర్ రిసోర్స్ పర్సన్ల శిక్షణ పూర్తయిందనీ, అదే తరహాలో జిల్లాల్లో సర్పంచ్‌‌లు, కార్యదర్శులుకు శిక్షణలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

శిక్ష‍ణను గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఖర్చు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పచ్చదనం, ప్రజా మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి అంశాల్లో లక్ష్య సాధన దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే ఆమోదం పొందిన గ్రామపంచాయతీ, మహిళా, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి గ్రామానికి ఊటకుంటతో పాటు బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,000 కొత్త వ్యవసాయ బావుల తవ్వకానికి కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధిగా ఎదగాలంటే స్వంత ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -