Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు

రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు

- Advertisement -

యూజీ, పీజీ కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి వర్తింపు
సీపీగెట్‌ నిర్వహణ బాధ్యత కేయూకు అప్పగింత : వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి
చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం (2026-27)లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సులకు వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేసింది. శనివారం హైదరాబాద్‌లో సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్‌, వీసీలు కుమార్‌ మొలుగారం (ఓయూ), కె ప్రతాప్‌రెడ్డి (కేయూ), టి యాదగిరిరావు (టీయూ), ఖాజాఅల్తాఫ్‌ హుస్సేన్‌ (ఎంజీయూ), జిఎన్‌ శ్రీనివాస్‌ (పీయూ), యు ఉమేష్‌ (ఎస్‌యూ), సూర్య ధనంజరు (మహిళా వర్సిటీ), ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి న్యూస్‌లెటర్‌ సంచికను బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం కోసం జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలు దిశగా సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. మండలి, విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం అవసరమని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో ఎన్‌ఈపీని అమలు చేయాలని తీర్మానించామని చెప్పారు. ఎన్‌ఈపీని అమలు చేయడం వల్ల విద్యా నాణ్యతను బలోపేతం చేయడమే కాకుండా న్యాక్‌, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌, ఎన్‌బీఏ, ఎన్‌సీఆర్‌ఎఫ్‌ వంటి గుర్తింపు, ర్యాంకింగ్‌ వ్యవస్థల్లో విశ్వవిద్యాలయాలకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయన్నారు. జాతీయస్థాయిలో పోటీ నిధులు, పరిశోధన నిధులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. వర్సిటీల్లో విద్యా, పరిశోధనా వాతావరణాన్ని బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. యూజీ మూడేండ్ల కోర్సుల డిగ్రీకి కనీసం 120 క్రెడిట్లు, నాలుగేండ్ల ఆనర్స్‌ లేదా ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ డిగ్రీకి 160 క్రెడిట్లు, పీజీ కోర్సులకు కనీసం 80 క్రెడిట్లు ఉండేలా క్రెడిట్‌ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. మైనర్‌ డిగ్రీలు, క్రెడిట్‌ నిర్మాణం, క్రెడిట్‌ బదిలీ విధానం, మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్‌లు, మల్టిపుల్‌ ఎంట్రీ-మల్టిపుల్‌ ఎగ్జిట్‌ విధానం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు సంప్రదాయ వర్సిటీల వీసీలతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2026-27)లో కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) నిర్వహణ బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)కు అప్పగించామని వివరించారు. ఐదేండ్ల సమగ్ర కోర్సుల కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షను తగిన సమయంలో నిర్వహించే విషయాన్ని కూడా సూచించామని చెప్పారు. ఉన్నత విద్యామండలి, యూజీసీ సూచనల మేరకు కొత్త యూజీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రతిపాదనలను వీసీలు ఆమోదించారని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరంలో సాధారణ విద్యాక్యాలెండర్‌ రూపొందించడంలో వర్సిటీలు, ఉన్నత విద్యామండలితో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. విద్యాశాఖ జారీ చేసిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అన్ని వర్సిటీల్లో అమలు చేయాలని వీసీలను ఆదేశించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సిలబస్‌ రూపకల్పన, క్రెడిట్‌ కేటాయింపు, థియరీ, ప్రాక్టికల్స్‌, ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటీస్‌షిప్‌లకు అవసరమైన బోధనా గంటల నిర్ణయానికి సంబంధించి ఉన్నత విద్యామండలి రూపొందించిన మార్గదర్శకాలను ఆమోదించామని అన్నారు. ఎన్‌ఈపీ-2020 సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించేందుకు వర్సిటీలు మండలితో కలిసి పనిచేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -