నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో సోమవారం సమగ్ర శిక్ష ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు దశల నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు మండల విద్యా వనరుల కేంద్రం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, భవిత కేంద్రం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. సమ్మె కాలానికి సంబంధించిన 29 రోజుల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని టీఎస్ యుటిఎఫ్ నాయకులు కోరారు. టీఎస్ యుటిఎఫ్ ప్రకటించిన మూడు దశల నిరసన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో సమగ్ర కేజీబీవీ కమ్మర్ పల్లి సిబ్బంది పాల్గొని తమ ఐక్యతను చాటారు.



