ముఖ్యమంత్రికి రాజకీయ పదవీకాంక్ష
ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు
గోదావరి బనకచర్ల విషయంలో తెలంగాణకి అన్యాయం
గోదావరి నల్లమల్ల సాగర్ కేసు కొట్టివేతలో ప్రభుత్వ నిర్లక్ష్యం: మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సుప్రీంకోర్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం బట్టబయలైందని, అందుకే ప్రభుత్వం వేసిన సూట్ డిస్మిస్ అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ పదవీ కాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారన్నారు.అప్పుడైనా, ఇప్పుడైనా పూర్తి ఆధారాలతోనే మేం మాట్లాడుతున్నామని తెలిపారు. గోదావరి-బనకచర్ల విషయంలో ఏపీ ముందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. సోమవారం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని, ‘సూట్ కూడా సరిగా వేయలేకపోయారు” అని సుప్రీంకోర్టు చెప్పిందని, కావాలనే లోపభూయిష్టమైన సూట్ వేశారన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసులో లోపాలు ఎలా ఉంటాయి? లోపాలతో కూడిన సూట్ ఎందుకు దాఖలు చేశారు? అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదులు ఏమి చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఇంత బలహీనమైన సూట్ వేయడం సాధ్యమా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను తిట్టడంపైనే దృష్టి ఉంది తప్ప తెలంగాణ నీటి ప్రయోజనాలపై లేదని, గతంలో వేసిన రిట్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, రిట్ కొట్టివేయబడిన తర్వాత వేసిన సూట్ కూడా కొట్టివేయబడిందన్నారు. నాడు గోదావరి-నల్లమల సాగర్ టెండర్లు పూర్తయ్యాకే కోర్టుకు వెళ్లారని, 11 డిసెంబర్ 2025న టెండర్లు పూర్తయితే, ప్రభుత్వం16 డిసెంబర్ 2025న రిట్ వేసిందని, అందుకే రిట్ కొట్టివేయబడిందని వివరించారు. ఇప్పుడు సూట్ కూడా కొట్టివేయబడిందన్నారు. ఏడు నెలలుగా బలమైన సూట్ ఎందుకు వేయలేకపోయారు? సూట్ లోపభూయిష్టంగా ఉందని సుప్రీంకోర్టు అక్షింతలు వేసిందని, చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదన్నారు.
రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు… తెలంగాణ జల ద్రోహి కూడా అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుతో అంతర్గత ఒప్పందం చేసుకుని తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, దేశంలోనే ఇంత లోపభూయిష్టమైన సూట్ మరొకటి ఉండదన్నారు. డిసెంబర్ 23న రేవంత్ రెడ్డి కమిటీ వేశారని, చంద్రబాబు సూచించిన ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించారని, ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ అధికారుల సమావేశాల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో ముగ్గురు సీఎంల సమావేశంలో ఏం జరిగిందో వెల్లడించాలన్నారు. పాలమూరుకు ఎన్‌ఓసీ తెస్తానని తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని, పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీళ్లు తెలంగాణ హక్కు.అని దానికి ఎన్‌ఓసీ అవసరం లేదన్నారు. రేవంత్‌కు అవగాహన తక్కువ… ఆవేశం ఎక్కువ అని దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో, నల్లమల ఎక్కడుందో కూడా ప్రభుత్వానికి తెలియదన్నారు. ఆదిత్యనాథ్ దాస్ మాటలు విని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మానిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీహరి, మామిండ్ల రాజేందర్, నరహరిరెడ్డి, పట్నం మానిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, విష్ణువర్దన్, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ ద్రోహే కాదు..జలద్రోహి కూడా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



