గిరిజనుల సాగులో ఉన్న భూములపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలి
అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్
భద్రాద్రిలో గిరిజనుల మహా ప్రదర్శన, ఐటీడీఏ పీఓకి వినతి
నవతెలంగాణ-భద్రాచలం
వామపక్షాలు భాగస్వామిగా ఉన్న యూపీఏ -1 ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని, గిరిజన రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని, వలస గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద ప్రారంభమైన గిరిజనుల ర్యాలీ పట్టణంలోని యూబీ సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం కార్యాలయం ప్రధాన గేటు ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా వద్దకు చేరుకున్న ఐటీడీఓ పీవో రాహుల్‌కు సీపీఐ(ఎం) నేతలు వినతి పత్రాన్ని అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఓ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో బండారు రవికుమార్, మాజీ ఎంపీ మీడియం బాబురావు, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎన్నికలకు ముందు గిరిజనుల సాగులో ఉన్న 8 లక్షల ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక 8 ఎకరాలకు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వలస ఆదివాసీల సాగులో ఉన్న భూమిని ఫారెస్ట్ అధికారులు బలవంతంగా వెనక్కి గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసీ గిరిజన రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు, దాడులు చేస్తుంటే గిరిజన శాఖ మంత్రి సీతక్క.. ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వినటం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తుందని అన్నారు. గిరిజనులను మోసం చేసిన ఏ ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేదని, గిరిజనుల జోలికి వస్తే గత పాలకులకు పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. సర్ పేరుతో వలస ఆదివాసీల ఓటు హక్కును రద్దుచేసి సంక్షేమ పథకాలను తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేస్తున్నాయని అన్నారు. గిరిజనుల జోలికి వస్తే సీపీఐ(ఎం) చూస్తూ ఊరుకోదని, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొలగాని బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, లిక్కి బాలరాజు, మందలపు జ్యోతి, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి, నిమ్మల వెంకన్న పాల్గొన్నారు.
ప్రతి ఎకరాకు హక్కు పత్రాన్ని ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



