Tuesday, July 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచట్టం గిట్టం జాన్తా నై..

చట్టం గిట్టం జాన్తా నై..

- Advertisement -

​సంఘం పెడితే ఊరుకోం కార్మికుల పట్ల బిస్లరీ యాజమాన్యం కాఠిన్యం
33వ రోజుకు సమ్మె…అమలుకు నోచని మంత్రి, జేసీఎల్‌ ‌హామీ
ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురిచేసేందుకు యాజమాన్యం కుట్ర
ఆందోళనలో కార్మికులు…సంఘీభావ ఉద్యమాన్ని ఉధృతం
చేసేందుకు సంఘాలు సన్నద్ధం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బిస్లరీ ..ఓ బ్రాండెడ్‌ ‌మల్టీనేషన్‌ ‌పరిశ్రమ. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం నుంచి నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది. రోజుకు సుమారు 30వేల కాటన్ల వ్యాపారం చేస్తున్నది. రూ. కోట్లల్లో లాభాలు ఆర్జిస్తోంది. కానీ కార్మికుల కష్టాన్ని ‌మాత్రం గుర్తించటం లేదు. వారి ఆకలి బాధలను అపహాస్యం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కార్మికులు…‘‘ఎన్నో ఏండ్లుగా ఇక్కడే పని చేస్తున్నాం..కనీస సౌకర్యాలు కల్పించండి సారూ.. ధరలు పెరుగుతున్నయ్‌.. సరుకుల అక్కర పెరుగుతున్నది. ఇచ్చే జీతం ఎనకటి అప్పులకు ఈఎంఐలు కట్టంగ..ఇంట్లోకి నిత్యావసరాలను ఎల్లదీయటం కష్టమవుతుంది. పిల్లల విద్యా వైద్యం భారమైతుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కొందరు కార్మికులు సంఘం పెట్టుకోవాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే బిస్లరీ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ (‌రిజిస్టర్‌ ‌నెం సీ/టీయూ/613/2025 అఫ్లీయేటెడ్‌ ‌సీఐటీయూ) ను ఏర్పాటు చేసుకున్నారు. అదే ఇప్పుడు పెద్ద నేరమైంది.

సంఘం పెడితే సంగతి చూస్తాం
‘ఇది మల్టీ నేషన్‌ ‌కంపెనీ. ఇక్కడ సంఘం గింగం కుదరదు. పాత రోజులు కావు.. కొత్త చట్టాలొచ్చినయ్‌..ఆ చట్టాలు సంఘం పెట్టుకోవటానికి అంగీకరించవ్‌. సంఘం పెడితే సంగతి చూస్తాం’ అంటూ యాజమాన్యం కార్మికులపై అగ్గిమీద గుగ్గిలమైంది. యూనియన్‌ పెట్టుకుని ఆఫీసు బేరర్లుగా ఎంపికైన యూ‌నియన్‌ ‌ప్రధాన కార్యదర్శి ఎన్‌ ‌శేఖర్‌‌రెడ్డితో పాటు నాగరాజు, నవీన్‌, అజయ్‌, రాము అనే కార్మికులను అక్రమంగా తొలగించింది. చట్టబద్దంగా ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ ‌నాయకత్వంపై యాజమాన్యం కక్ష సాధింపులకు పాల్పడుతున్నది. యూనియన్‌ ‌రద్దు కోసం తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. బెదిరింపులకు పాల్పడింది. వీరితో ఎవరెవరు మాట్లాడుతు న్నారో తెలుసుకునేందుకు విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. యూనియన్‌ ‌వాళ్లతో ఎవరైనా మాట్లాడితే..వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నది. కంపెనీ ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయటంతో ఒక యుద్ధవాతావరణాన్ని క్రియేట్‌ ‌చేసింది.

చట్టాన్ని ఉల్లంఘించటమే..
చట్టబద్దంగా ఏర్పాటు చేసుకున్న కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని యూనియన్‌ ‌నేతలు డిప్యూటీ లేబర్‌ ‌కమిషన్‌ ‌దృష్టికి తీసుకుపోయారు. దీంతో కార్మిక శాఖ అధికారులు ఎనిమిది నెల్లుగా కన్సిలేషన్‌ ‌మీటింగ్‌‌లు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల సమస్య పరిష్కారం కాలేదు. జూన్‌ 3 కన్సిలేషన్‌ ‌మీటింగ్‌ ‌పెండింగ్‌‌లో ఉన్న సమయంలో చట్ట విరుద్దంగా, ఏకపక్ష‍ంగా జూన్‌ ఒకటిన ఐదు మంది కార్మికులను డిస్‌‌మిస్‌ ‌చేస్తూ పుల్‌ అండ్‌ ‌ఫైనల్‌ ‌సెటిల్‌‌మెంట్‌ ‌డబ్బులను కార్మికుల బ్యాంక్‌ ‌ఖాతాలోకి వేసింది. యాజమాన్యం అనుసరించిన ఈ చర్య చట్టాన్ని ఉల్లంఘించటం కాకపోతే మరేమౌతుంది?

33రోజులుగా శాంతియుత నిరసన
డిస్మిస్‌ ‌చేసిన ఐదుగురు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మిషన్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్న 40మంది కార్మికులు సమ్మెలోకి దిగారు. 33 రోజులుగా శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. నీళ్లను ప్రాసెస్‌ ‌చేసే మిషన్‌ ఆపరేటర్ల క‘న్నీళ్ల’ను కాఠిన్యం లేని యాజమాన్యం పట్టించుకోవటం లేదు. కార్మిక శాఖ మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి, జేసీఎల్‌‌కు మొరపెట్టుకున్నా..వారి ఘోస పట్టించుకున్న పాపాన పోవటం లేదు.

అసౌకర్యాలకు నిలయం ఆ పరిశ్రమ..
కార్మికుల శ్రమతో పెద్ద ఎత్తున యాజమాన్యం లాభాలు గడిస్తూ..కార్మికులకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించటం లేదు. వెస్టేజీ బాటిళ్లను రీ సైక్లింగ్‌ ‌చేసి క్లాతుగా మార్చి కార్మికులకు యూనిఫాం ఇవ్వడంతో రేడియేషన్‌‌తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అదే పరిశ్రమలో కార్మికులు తయారు చేసిన వాటర్‌‌ను వారు తాగటానికి వీలు లేదు. ఎవరైనా దాహంతో అనివార్యంగా తాగితే..రూ.300పెనాల్టి కట్టాల్సిందే. అక్కడ క్యాంటిన్‌ ‌సౌకర్యం లేకపోవటంతో మిషన్ల వద్దనే భోజనాలు చేయాల్సి వస్తున్నదని కార్మికులు తమగోడు వెల్లబోసుకుంటున్నారు. సరిపోను మూత్రశాలలు, ట్రాన్స్‌‌పోర్టు సౌకర్యం లేదు. ప్రాధమిక వైద్య చికిత్స బాక్సులు లేవు. కాంట్రాక్ట్‌ ‌కార్మికులకు కనీస వేతనాలు, బోనస్‌,ఓటీడబుల్‌, ఈఎల్స్‌,ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ‌తదితర చట్టబద్ద సౌకర్యాలు అమలు కావటం లేదు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న కార్మికులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసి లొంగదీసుకునేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తున్నది.

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
యూనియన్‌ ఏర్పాటు చేసుకోవటం నేరంగా భావించి, కార్మికులను బదిలీల పేరుతో బిస్లరీ ఇంటర్‌‌నేషనల్‌ ‌ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌యాజమాన్యం బరితెగించి వ్యవహరిస్తున్నది. 1926 ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌చట్టం ప్రకారం బిస్లరీ కార్మికులు చట్టబద్దంగా యూనియన్‌ ‌రిజిస్టర్‌ ‌చేసుకున్నారు. కార్మిక శాఖ యూనియన్‌ ‌పెట్టుకోవడానికి సర్టిఫికెట్‌ ‌కూడా ఇచ్చింది. యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా అన్‌‌ఫెయిర్‌ ‌లేబర్‌ ‌ప్రాక్టీస్‌‌కు పాల్పడుతున్నది. సంగారెడ్డి డీసీఎల్‌, జేసీఎల్‌, కమిషనర్‌ ఆఫ్‌ ‌లేబర్‌, మంత్రి..యాజమాన్యాన్ని ఎందుకు ప్రాసిక్యూట్‌ ‌చేయటం లేదో చెప్పాలి.
అతిమేల మానిక్‌ యూనియన్‌ అధ్యక్ష‍ులు – సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్ష‍ులు

కక్ష‍ సాధింపు తగదు..
ఎన్నో ఏండ్లుగా కంపెనీలో పని చేస్తున్నాం. కష్టమైనా నిష్టూరమైనా భరించాం. సంఘం పెట్టుకుంటే..మాపై ఇంత ద్వేషమెందుకు? చట్ట ప్రకారం కల్సించాల్సిన సౌకర్యాలు, ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వాలని అడగటం నేరమా? రెండు నెల్లుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయి. పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించలేక పోతున్నాం. ఈ విషయాలను పలు మార్లు అధికారులకు, యాజమాన్యానికి చెప్పినా..పెడచెవిన పెడుతున్నారు. మా డిమాండ్లు న్యాయమైనవి. అవి నెరవేరే వరకు పోరాటాన్ని ఆపం.
ఎన్‌ ‌శేఖర్‌ ‌రెడ్డి, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -