Tuesday, July 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకరువుపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి

కరువుపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
‌కన్నేపల్లి నుంచి తక్ష‍ణమే నీటిని ఎత్తిపోయాలి
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం
ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎల్‌‌నినో నేపథ్యంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులపై రాష్ర్ట ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష‍ాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. సోమవారం హైదరాబాద్‌‌లోని సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌‌లో తెలంగాణ ఇండిపెండెంట్‌ ‌జర్నలిస్ట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో “కరువు వర్సెస్ కాళేశ్వరం…కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా ? ” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో ప్రజలకు సాగు, తాగు నీరందించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎల్‌‌నినో వల్ల కరువు రాబోతోందని శాస్ర్త వేత్తలు, నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళిక రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీర్లు, మేధావులు పార్టీల వారీగా చీలిపోవడం మంచి పరిణామం కాదన్నారు. గోదావరి నదిలో మేడిగడ్డ దిగువన వృధాగా పోతున్న నీటిని ఎత్తి పోసే విషయంలో నిపుణులు, రిటైర్డ్‌ ఇంజినీర్లతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు చేసి వాడుకలోకి తీసుకు రావాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్డీఎస్‌ఏ, కేంద్ర ప్రభుత్వం సైతం కాళేశ్వరం విషయంలో తమకేమి పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డితో పాటు ప్రతిపక్ష‍ాలు తమ బాషను మార్చుకోవాలని జూలకంటి సూచించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ గేట్లు దింపకుండానే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తి పోసి ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, పాలకులు ఎవరు తప్పు చేసినా… వారిని శిక్ష‍ించాలనీ, అదే సందర్భంలో ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని ఎత్తి పోయాలని సూచించారు. ప్రజల కష్టాల గురించి ఆలోచించాల్సిన సీఎం ఎన్డీఎస్‌ఏ పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ఇంజినీరింగ్‌ ‌నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఎస్‌ఏను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు.
రాజకీయ నాయకులు, పార్టీలపై కోపంతో పంతాలకు పోయి మొండిగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రిటైర్డ్‌ ఇంజినీర్ల ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం మేడిగడ్డపై వారు సూచన చేస్తే బెల్ట్‌తో కొడతా, జైళ్లో పెడతానంటూ మాట్లాడం సరికాదన్నారు. రిటైర్డ్‌ ఇంజినీర్లకు ముఖ్యమంత్రి వెంటనే క్ష‍మాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పాపారావు మాట్లాడుతూ ఎన్డీఎస్‌ఏ ప్రాథమిక రిపోర్ట్‌ ఇచ్చి రెండేండ్లు గడుస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు మరమ్మత్తులు చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. నీటి పారుదల శాఖ, విద్యుత్‌ ‌రంగాలకు చెందిన రిటైర్డ్‌ ఇంజినీర్లు వెంకటేశం, తుల్జారాం సింగ్‌, శ్రీధర్‌‌దేశ్‌‌ పాండే, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -