Tuesday, July 14, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలి

- Advertisement -

విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి
సీజేపీ ఆందోళన, సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు
సీపీఐ(ఎం) నేతల సంఘీభావం
20న నిర్వహించే ‘చలో పార్లమెంట్’
విజయవంతం చేయాలి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని సీపీఐ(ఎం) నేతలు డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని సోమవారం సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ అమ్రారామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య,టి.జ్యోతి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, లోకనాథం, డి.రమాదేవి, సందర్శించారు. ఈ సందర్భంగా వారు సోనమ్ వాంగ్‌చుక్‌ను పరామర్శించి, సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. అనంతరం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో సమావేశమై ఉద్యమ పరిస్థితులను, భవిష్యతనెలార్యాచరణను చర్చించారు. దీక్షా శిబిరంలో ఉన్న విద్యార్థులు, యువత, ప్రజలకు నాయకులు అభివాదం చేశారు. అలాగే ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసిన ‘క్రాంతి వేదిక’ను సందర్శించారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ అమ్రారామ్ మాట్లాడుతూ విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, పరీక్షల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి సీపీఐ(ఎం) దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఈ సమస్యను పార్లమెంట్‌లో బలంగా లేవనెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ నెల 20న నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.

సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ 16 రోజులుగా కొనసాగుతున్న సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష అసాధారణ త్యాగమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని విమర్శించారు. ఈ నెల 20న నిర్వహించబోయే ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, తెలంగాణలో సైతం సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ స్పందించి మంత్రిని తొలగించాలని, లేకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే, ప్రజలే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేలా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ పేపర్ లీకేజీల వల్ల అత్యధికంగా నష్టపోతున్నది గ్రామీణ ప్రాంతాల పేద, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం పరీక్షల సమస్య మాత్రమే కాదని, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడుతూ కోట్లాది మంది కార్మికుల సంపూర్ణ మద్దతు సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి ఉందన్నారు. ‘మీరు ఒంటరివారు కాదు.. దేశ ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు మీతో కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తారు’ అని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతమైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -