మండలానికో ఇంట్రిగేడెట్ స్కూల్
అందరూ ఒకే చోట చదువుకునేలా నిర్ణయం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి
సీఎంతో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ కిషోర్ మక్వానా భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో కుల వివక్షను పోగొట్టేలా చర్యలు తీసుకుంటు న్నామనీ, అన్ని సామాజిక తరగతుల పిల్లలు ఒకే దగ్గర చదువుకునేలా 25 ఎకరాల్లో మండలానికో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ కిషోర్ మక్వానాకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వివరించారు.సోమవారం హైదరా బాద్‌లోని ప్రజా భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కిషోర్ మక్వానా భేటీ అయ్యారు. అందులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాంచందర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కిషోర్ మక్వానాకు సీఎం వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని స్కూళ్లలోనే అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ లోపలున్న ప్రాంతంలో మొదటగా వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంఖ్యను పెంచుతున్నామని విడమర్చి చెప్పారు. తెలంగాణలో ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నామనీ, రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించామని వివరించారు. ఎస్సీవర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులను
అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన డీబీఎఫ్
ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ కిషోర్ మక్వానాకు దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును సక్రమంగా అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఆ చట్టం ప్రకారం సీఎం అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం ఏటా రెండు సార్లు జరగాలని గుర్తుచేశారు. తెలంగాణలో మాత్రం 13 ఏండ్లుగా ఆ సమావేశాలను నిర్వహించడం లేదని కిషోర్ మక్వానా దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాస్థాయిలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీల నియామకం జరగట్లేదని తెలిపారు.
ఎన్‌సీఎస్‌సీ ద్వారా రెండేండ్లలో 60 వేలకుపైగా కేసుల పరిష్కారం
హైదరాబాద్ కార్యాలయం పరిధిలో బాధితులకు రూ.33.8 కోట్ల పరిహారం :
ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభంలో జాతీయ చైర్మెన్ కిషోర్ మక్వానా
దేశంలో రెండేండ్లలో 60 వేలకుపైగా కేసులను పరిష్కరించి తమ కమిషన్ చరిత్ర సృష్టించిందని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్(ఎన్‌సీఎస్‌సీ) జాతీయ చైర్మెన్ కిషోర్ మక్వానా చెప్పారు. సోమవారం హైదరాబాద్ లో గల కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో ఆధునికీకరించిన కమిషన్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీఎస్‌సీ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, ఎన్‌సీఎస్‌సీ కార్యదర్శి గుడే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ మక్వానా మాట్లాడుతూ..అణగారిన వర్గాలకు న్యాయాన్ని అందించేందుకు, వారి హక్కులను పరరక్షించేందుకు ఎన్‌సీఎస్‌సీ కార్యాలయాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, హక్కుల రక్షణ ముఖ్యమైనవని స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదుదారునికీ సకాలంలో న్యాయం అందించాలనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ మాట్లాడుతూ..ఎస్సీ- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈ అభివృద్ధికి, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజా ప్రతినిధులు, విధాన రూపకర్తలను ఆయన కోరారు. ఎన్‌సీఎస్‌సీ కార్యదర్శి గూడె శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యాన్ని తొలగించ డానికీ, సామర్థ్యాన్ని విస్తరించడానికీ డిజిటల్ సాధనాలను, ఆధునిక మౌలిక వసతులను ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ ప్రాంతీయ శాఖ పనితీరు గురించి ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్ కుమార్ బాబు వివరించారు.



