Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి

దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి

- Advertisement -

22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపుతాం
ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే
ఎదుర్కొనేలా కార్యాచరణ అమలు
దేవాదుల ఆయకట్టుకు సాగునీరు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంత్రి ఉత్తమ్, పొంగులేటితో కలిసి ప్రాజెక్టు పనుల పరిశీలన


నవతెలంగాణ – ములుగు
దేవాదుల ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పంపింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగిస్తామని తెలిపారు. 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపి దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు రైతులకు గోదావరి జలాలతో శాశ్వత భరోసా కల్పిస్తామని అన్నారు. సోమవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్న భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పో, డీఎఫ్‌ఓ వికాస్ మినా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుపాకులగూడెం సమ్మక్క సారలమ్మ బ్యారేజీ గోదావరి నది నీటి ప్రవాహాన్ని నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనులు, భూ సేకరణ, ఎత్తిపోతల సామర్థ్యం, సాగు తాగునీరు, మోటార్ల పనితీరుపై పీపీటీ ద్వారా ఇంజినీరింగ్ అధికారులు వివరించగా ఆయా అంశాలపై డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
దేవాదుల ఎత్తిపోతల పథకం రాష్ట్రంలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అత్యంత కీలక ప్రాజెక్టు అని అన్నారు. భూసేకరణను వేగవంతంగా పూర్తి చేసి, ప్రాజెక్టు పనుల్లో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పెండింగ్ బిల్లులను ఇప్పటికే విడుదల చేశామని అన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే ఎదుర్కొనే కార్యాచరణను అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో కలిసి పలుమార్లు విస్తఅతస్థాయిలో సమీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గరిష్ఠ స్థాయిలో వినియోగిం చుకోవాలని, ఎక్కడెక్కడ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందో అక్కడ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

​మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..
దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, పంపింగ్ వ్యవస్థ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూసేకరణ, పెండింగ్ పనులు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి, అధికారులతో కలిసి ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో ఉన్న 10 పంపుల్లో 7పంపులు పనిచేస్తున్నాయని, మరో ఒకటి రెండు రోజుల్లో 10పంపులను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ములుగు, వరంగల్ చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.194 కోట్ల బిల్లులను ఆర్థిక మంత్రి సహకారంతో వెంటనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భూసేకరణ కారణంగా ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు రెండింటికీ నీరు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే దఅఢ సంకల్పంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సుమారు 6.14లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, ఇందులో దాదాపు 92 శాతం ఆయకట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా, మిగిలిన భాగం నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉందన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నందుకు ప్రజా ప్రభుత్వానికి.. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు సమర్థవంతంగా పనిచేయాలంటే నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, పంపుల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న సంస్థ మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ఈ మూడు వ్యవస్థలు సమిష్టిగా పనిచేస్తేనే పంపింగ్ వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగి రైతులకు సకాలంలో సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, సంపత్‌రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -