నవతెలంగాణ – మిరుదొడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా 18 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించడంలో పూర్తిగా విఫలమైందని అన్నదాతలు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక వ్యవసాయం చేయలేక కరువుతో అల్లాడిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్బర్ పేట భూంపల్లి మండలం కాజీపూర్ సబ్ స్టేషన్ ముందు గురువారం రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 18 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీఫేస్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. కనీసం రోజుకు కనీసం 8 గంటల విద్యుత్ కూడా నిరంతరంగా సరఫరా చేయకపోవడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూనే రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఒకవైపు వేసిన పంటలు చేతికందకా.. మరొకవైపు తెచ్చిన అప్పులు తీర్చక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు. వ్యవసాయానికి సరైన విద్యుత్ సరఫరా అందక నారుమడులు కూడా వేసుకోలేక భూములు బీడుగా మారుతున్నాయని వాపోయారు. పంటలు వేసిన రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని తెలిపారు. చాలీచాలని విద్యుత్ సరఫరాతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని, పెట్టుబడి పెట్టిన డబ్బులు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిరంతరంగా 18 గంటల త్రీఫేస్ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
సబ్ స్టేషన్ ఎదుట రైతన్నల బైఠాయింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



