నవతెలంగాణ-ఆలేరు టౌన్
నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ .. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, సోనమ్ వాంగ్చుక్ పిలుపులో భాగంగా చలో పార్లమెంట్ కి వెళ్తున్న యువకులపై లాఠీ చార్జి చేయడం సిగ్గుమాలిన చర్య అని ప్రగతిశీల యువజన సంఘం(పి.వై.ఎల్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు. ఆలేరు పట్టణంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పి.వై.ఎల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు మారుజొడు సిద్దేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో పివైయల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన జరుగుతున్నప్పటికీని కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడనాడి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తన డిమాండ్లపై కనీసం చర్చించకుండా బలవంతంగా పోలీసు బలగాలు వచ్చి దీక్షను విరమింప చేయడం దేనికి నిదర్శనం అని అన్నారు. ఈరోజు సోనం వాంగ్ చుక్ పిలుపులో భాగంగా యువకులు పార్లమెంటు ముందు నిరసనకు బయలుదేరిన క్రమంలో యువకులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేయడం సరైన కాదని, వారి న్యాయమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తుంటే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడమేంటని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90కి పైగా పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తూ జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబిస్తూ విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రగతిశీల యువజన సంఘం (పివైయల్) ఆధ్వర్యంలో ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యార్థులు, యువకులుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వడ్లకొండ నాగరాజు, చికిలం వెంకటేష్, సహాయ కార్యదర్శి చిరబోయిన బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలగందుల సిద్ధులు, దడిగే కృష్ణ, కుండే బీరయ్య తదితరులు పాల్గొన్నారు.



