Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయం​పోటెత్తిన యువతరంగం

​పోటెత్తిన యువతరంగం

- Advertisement -

ఉద్రిక్తంగా పార్లమెంట్‌ ‌మార్చ్‌
యువతపై ‌లాఠీచార్జీ, టియర్‌‌గ్యాస్‌, వాటర్‌‌కెనాన్స్‌ ప్రయోగం
ఇంటర్నెట్‌‌, మొబైల్‌ ‌నెట్‌‌వర్క్‌ ‌నిలిపివేత
లాఠీదెబ్బలు తింటూనే పార్లమెంట్‌ సమీపంలోకి
దూసుకెళ్లిన ఆందోళన కారులు ఉలిక్కిపడిన కేంద్రం
సీజేపీ నేతలతో కేంద్రమంత్రుల చర్చలు
అమిత్‌‌షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌భేటీ
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు
జాతీయ జెండాలు, అంబేద్కర్, భ‌గ‌త్ సింగ్,
మహాత్మాగాంధీ చిత్ర పటాలతో యువ‌త‌
ఆస్పత్రిలో సోన‌మ్ వాంగ్ చుక్‌ దీక్ష కొనసాగింపు
అబిజీత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ నేత‌లు ఆద‌ర్శ్‌,
ఐషీ ఘోష్‌ తదితరులు దీక్షల విరమణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఢిల్లీ ఉలిక్కి పడింది. దేశ యువతలోని ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, ఆందోళనను తక్కువ అంచనా వేసిన కేంద్రం యువతరం పట్టుదలను చూసి ఖంగుతింది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈలో అవ‌క‌త‌వ‌క‌లకు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని, ఎన్టీఏను ర‌ద్దు చేయాల‌ని, ఎన్ఈపీని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘పార్లమెంట్ మార్చ్’ ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తున్నా విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకునే ప్రయత్నం చేశారు. వారిని చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు, పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్‌‌గ్యాస్‌ ‌ప్రయోగించారు. వాటర్‌ ‌కెనాన్స్‌‌తో యువతను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చేతుల్లో జాతీయ జెండాలు, అంబేద్కర్, భ‌గ‌త్ సింగ్, మహాత్మాగాంధీ చిత్ర పటాలతో లాఠీదెబ్బలు తింటూనే యువ‌త‌ పార్లమెంటు భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు గాయపడ్డారు. వంద‌లాది మందిని అరెస్టు చేసి ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. అయినా యువతరం బెదరలేదు. మరోవైపు పార్లమెంటులోనూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సీజేపీ డిమాండ్లలో తప్పు ఏముందో చెప్పాలంటూ కేంద్ర మంత్రుల్ని నిలదీశారు. సర్కారు లోపాలు, బాధ్యతారాహి త్యానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించాయి. ఇంటా, బయట పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు తమ మూడు ప్రధాన డిమాండ్లను ఆయన వద్ద పునరుద్ఘాటించారు. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌హోంమంత్రి అమిత్‌‌షాతో భేటీ అయ్యారు. ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్ ఆస్పత్రిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ నేత‌లు ఆద‌ర్శ ఎం.సాజీ, ఆయుషీ ఘోష్‌, ఏఐఎస్ఎఫ్‌ నాయకులు నేహా, మనీష్, అమీన్ లు తమ దీక్షల్ని విరమించారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

ఆందోళనకారులతో నిండిన జంతర్‌‌మంతర్‌​​
‌సీజేపీ నేతృత్వంలో చేపట్టిన పార్లమెంట్‌ ‌మార్చ్‌‌తో ఢిల్లీ జంతర్‌మంతర్‌ ‌యువతరంతో నిండిపోయింది. విద్యార్థులు, యువతీ యువకులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా అక్కడకు తరలివచ్చారు. వారి నిరసనలతో దేశ‌ రాజధాని స్తంభించింది. భారీ వర్షం కురుస్తున్నా, పోలీసుల ఆంక్షలు హెచ్చరిస్తున్నా యువతరం ఎక్కడా బెదరలేదు. సోమవారం ఉదయాన్నే దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, యువ‌త‌, మద్దతుదారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. వారికి సంఘీభావంగా పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

ఎక్కడికక్కడ అడ్డగింతలు
పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన విద్యార్థులను పోలీసులు, కేంద్ర బలగాలు మెట్రో స్టేష‌న్లు, ఇత‌ర ప్రాంతాల వ‌ద్దే అడ్డుకున్నాయి. జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్దకు వెళ్ల‌కుండా కట్టడి చేసే ప్రయత్నం చేశాయి. సీజేపీ చీఫ్‌ అభిజీత్ దీప్కే కు మద్దతు తెలిపేందుకు వచ్చిన పార్ల‌మెంట్ స‌భ్యులు, రాజ‌కీయ నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు నేతలు దీప్కే నిరాహార దీక్ష చేపట్టిన వేదిక వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారా మిలటరీ బలగాలతో ఢిల్లీ పోలీసులు అడుగ‌డుగునా ఆంక్ష‌లు విధించారు. వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ లను ప్ర‌యోగించారు. చుట్టూ బారికేడ్లు, ఫెన్సింగ్ లతో విద్యార్థులు, యువ‌త‌ను నిర్బంధించారు. వారిపై పోలీసులు జులం ప్ర‌ద‌ర్శించారు. పోలీసుల లాఠీచార్జీతో వంద‌లాది మందికి గాయాలయ్యాయి. ఈ-డ్రోన్ వీడియోలో జంతర్ మంతర్ తో పాటు కిలోమీటర్ల పొడవున ఆందోళన కారులు బారులు తీరి కనిపించారు. ఆ పక్కనే ఉన్న పార్లమెంట్ స్ట్రీట్, రెసినా హిల్స్, ఇండియా గేట్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, సెంట్రల్ ఢిల్లీ మొత్తం విద్యార్థుల‌తో నిండిపోయింది.

​పార్ల‌మెంట్‌ సమీపానికి విద్యార్థులు, యువ‌త‌
మధ్యాహ్నం తరువాత‌ జంతర్ మంతర్ నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న పార్లమెంట్ వైపునకు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కదిలారు. జాతీయ జెండాలు, అంబేద్కర్, భ‌గత్ సింగ్, మహాత్మా గాంధీ త‌దిత‌ర ప్ర‌ముఖుల‌ చిత్ర పటాలను చేతిలో పట్టుకొని శాంతియుతంగా నినాదాలతో ముందుకు సాగారు. కొందరు సంసద్ మార్గ్ వైపు నుంచి పార్లమెంట్ చేరుకునేందుకు ప్రయత్నించారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురికి గాయాలయ్యాయి. వీరికి అక్కడికడ్కకే ప్రథమ చికిత్స అందించారు. మరోవైపు జంతర్ మంతర్ సర్కిల్ వద్ద‌ నుంచి మరికొంత మంది పార్లమెంట్ వైపు కదం తొక్కారు. వీరిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. వేలాది సంఖ్యలో ఉన్న ఆందోళనకారులను అడ్డుకోవడం భద్రతా బలగాలకు సాధ్యం కాలేదు. నిర్భంధాలను ఎదుర్కొంటూ, లాఠీదెబ్బలు తింటూఆదే మార్గంలో ముందుకు నడుస్తూ, రైసినా హిల్స్ మీదుగా పార్లమెంట్ వైపునకు వెళ్లారు. ఈ సందర్భంగా రైల్ భవన్, పార్లమెంట్ సమీపాన ఉన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా దగ్గర విద్యార్థులు, యువ‌త‌పై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భాష్ఫ వాయువు(టియర్ గ్యాస్)ను ప్రయోగించింది. అనంతరం లాఠీచార్జీ చేసి విద్యార్థులు, యువ‌త‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

పార్లమెంట్ మెయిన్ గేట్ మూసివేత
​సీజేపీ మార్చ్ పార్లమెంట్ సమీపానికి రావడంతో పార్లమెంట్ భద్రతా బలగాలు ఒక్క సారిగా అలర్ట్ అయ్యాయి. విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్‌కు ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి, ఇతర మంత్రులు, ఎంపీలు వెళ్లే మెయిన్ గేట్‌కు పార్లమెంట్ భద్రతా సిబ్బంది తాళం వేశారు. ఈ గేటును దాటుకొని వస్తే అడ్డుకునేలా ఫైర్ ఇంజన్ పైపులను పోలే వాటర్ పైపులను సిద్ధం చేసుకున్నారు. పరిస్థితులు చేయి దాటితే తుపాకి కాల్పులు చేసేలా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పొజిషన్ తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడటంతో ఆ సమీపంలోని కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను మూసి వేశారు. ఎవ‌రినీ లోనికి రాకుండా భద్రతను పెంచారు.

​‘ఎంతైనా కొట్టండి’ ‘బొద్దింకల’ గాండ్రింపు​
ఇండియా గేట్, పార్లమెంట్‌కు వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు వీటన్నింటినీ దాటుకుని ఢిల్లీకి తరలిరావడంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు వృధా అయ్యాయి. పార్లమెంట్ స‌మీప ప్రాంతం ‘బొద్దింకల’తో నిండిపోయింది. ‘పార్లమెంట్ మార్చ్‌’ లో పాల్గొన్న నిరసనకారులపై పలు చోట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఒక్కొక్కరినీ టార్గెట్ చేసుకొని, రౌండప్ చేసి లాఠీలతో చితకబాదారు. ఒక ఆందోళన కారుడిని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(చుట్టు ముట్టి) ఐదుగురు కలిసి చావ బాదారు. ఈ దెబ్బలను తట్టుకొని అలాగే నిలిచిపోయిన నిరసనకారుడు ఎంతైనా కొట్టండి అంటూ అరుస్తోన్న వీడియో వైరల్ అయింది. మరికొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఒక యువకుడికి చాఠీఛార్జీలో కాలికి తీవ్రగాయమైంది. అయినప్పటికీ, నినాదాలు చేస్తూనే ఉండటం అక్కడివారిని కదిలించింది. అంతకు ముందు.. మద్దతుదారులు “శాంతంగా ఉండాలి” అని సీజేపీ కోరింది. ‘కొన్ని చోట్ల మిమ్మల్ని అడ్డగించినప్పటికీ, ప్రశాంతంగా ఉండి శాంతిని కాపాడండి. మనం శాంతి, ప్రేమతో మాత్రమే దీన్ని గెలుస్తాం” అని పేర్కొంది. దీంతో విద్యార్థులు, యువత ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లకు ఆస్కారం ఇవ్వ‌లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులే విద్యార్థులు, యువ‌త‌పై అమాన‌వీయంగా దాడికి దిగారు. నటులు ప్రకాష్ రాజ్, షబానా అజ్మీలపై కూడా భద్రతా దళాలు దాడి చేశాయి. గీతాంజలి ఆంగ్మోపై దారుణంగా దాడి జరిగింది. జంతర్ మంతర్ వద్ద నిరసన వేదికలను ధ్వంసం చేశారు.

​మెట్రో స్టేషన్లు మూసివేత‌
​సీజేపీ పార్ల‌మెంట్‌ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పార్లమెంట్ తో కనెక్ట్ అయ్యే జన్ పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియల్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను మూసివేసింది. అలాగే లోక్ కళ్యాణ్ మార్గ్ (ప్రధాని నివాసం సమీపంలోని) మెట్రో స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని ఇంటి వైపు మార్గాల్లో రెండంచెల భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నేట్ సేవలు, మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల‌ను నిలిపివేశారు.

​చర్చలకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ నేతలతో చర్చలకు వచ్చారు. సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంగ, సౌరవ్ దాస్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్‌తో తక్షణమే రాజీనామా చేయించి, పదవి నుంచి తొలగించాలని కోరుతూ, తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని వారు అందజేశారు. ఈ డిమాండ్లపై తగిన స్థాయిలో చర్చిస్తామని నడ్డా చెప్పారు. అయితే, చర్చల్లో ఎలాంటి హామీ లభించలేదని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు శాంతియుత నిరసనలు ఆపబోమని సౌరవ్ దాస్ అన్నారు. మరోవైపు పార్లమెంట్ లోని తన ఛాంబర్ లో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స‌మావేశం అయ్యారు.

ఖండించిన ప్రతిపక్షాలు
కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా సోమవారం ప్రారంభమైన పార్లమెంటులో గందరగోళం నెలకొంది. పోలీసుల క్రూరత్వాన్ని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) టీఎంసీ, డిఎంకె, ఆప్‌, ఎస్‌పి, ఎన్‌సిపితో పాటు దేశంలోని అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఖండించాయి.

​సీపీఐ(ఎం) సహా పలువురి మద్దతు​
ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్షను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ నేత‌లు ఆద‌ర్శ ఎం.సాజీ, ఐషీ ఘోష్‌, ఏఐఎస్ఎఫ్‌ నాయకులు నేహా, మనీష్, అమీన్ ‌లు తమ నిరాహార దీక్షల్ని విరమించారు. వీరితో సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్, బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఆర్జేడీ నేత రాజా రామ్ పాల్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాద‌వ్‌, నీట్ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఆత్మహత్య చేసుకున్న రియా థాపా తండ్రి, మాజీ సైనికుడు రాజేష్ థాపాలు నిమ్మ రసాలు ఇచ్చి వారితో దీక్షలు విరమింపజేశారు. ఎస్ఎఫ్ఐ నేత‌లు ఆద‌ర్శ ఎం.సాజీ, ఆయుషీ ఘోష్‌లు సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ, సీనియ‌ర్ నాయ‌కురాలు బృందా క‌ర‌త్, పొలిట్ బ్యూరో స‌భ్యులు ఆర్‌ అరుణ్ కుమార్‌, విజూ కృష్ణ‌న్‌, నిలోత్ప‌ల్ బ‌సు, కేంద్ర క‌మిటీ స‌భ్యులు క‌నికా ఘోష్‌, ఏఐఏడ‌బ్ల్యుయు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వెంక‌ట్ స‌మ‌క్షంలో దీక్ష విర‌మించారు. నిరాహార దీక్షలు ముగిసినా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు సీజేపీ పోరాటం కొనసాగుతుందని నేత‌లు ప్రకటించారు. మరోవైపు అభిజీత్ దీప్కే అరెస్ట్ పై కాసేపు గందరగోళం నెలకొంది. దీప్కే ను పోలీసులు అరెస్ట్ చేశారని సిజెపి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ వాదనలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. దీప్కే పోలీసుల అదుపులో లేరని, ఆయన వేదికపైనే ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పష్టత ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -