Tuesday, July 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులాఠీచార్జీ అమానుషం

లాఠీచార్జీ అమానుషం

- Advertisement -

​ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి : సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ డిమాండ్‌
మోడీ మౌనం శోచనీయం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ ‌దీక్షకు సంఘీభావంగా ప్రదర్శన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్‌ వాంగ్ చుక్ చేపట్టిన దీక్షకు, యువత ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ సీపీఐ(ఎం) రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞానం కేంద్రం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తేయాలని, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఐటీ)ని రద్దు చేయాలని, లాఠీచార్జీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్‌‌కు సంబంధించిన న్యాయమైన డిమాండ్లతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, వారి గొంతును అణిచివేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయడం, భాష్పవాయుగోళాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రశ్నించిన వారిపై దమనకాండకు పాల్పడటం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల 22 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాయని అన్నారు. ఒత్తిడి తట్టుకోలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌ ‌దిగి రాకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సోనమ్‌‌ వాంగ్‌‌చుక్‌ ‌దీక్షకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వెస్లీ ప్రకటించారు.

ప్రధాని మోడీ మౌనం వహించడం శోచనీయం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య
న్యాయం కోసం దేశ యువత రోడ్ల మీదికొచ్చి ఆందోళన చేస్తుంటే ప్రధాని మోడీ మౌనం వహించటం శోచనీయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. ఆయన మౌనం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువత పట్ల బీజేపీ సర్కారు ‌కర్కశంగా వ్యవహరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు గోడలను తలపించేలా బారికేడ్లను నిర్మించడమేంటని ప్రశించారు. నీట్‌ ‌పేపర్‌ లీకేజీపై చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పార్లమెంట్‌‌లో ప్రతిపక్షాలన్నీ గొంతెత్తి అరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థులతో చర్చించి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి మాట్లాడుతూ నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు డిజి.నర్సింహారావు, పార్టీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌, ఐద్వా రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, కేవీపీఎస్‌ ‌రాష్ర్ట ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్‌, సీపీఐ(ఎం) హైదరాబాద్‌ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు కోటరమేశ్‌, అనగంటి వెంకటేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -