సొసైటీల ఖాతాల్లోనే నగదు జమ చేయాలి
మరణించిన 986 మంది కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : కలెక్టరేట్ ఎదుట ధర్నాలో టీఎంకేఎంకేఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్
నవతెలంగాణ-సిటీ బ్యూరో
రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ఉచిత చేప, రొయ్య పిల్లల పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మికుల సంఘం (టీఎంకేఎంకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట సోమవారం మత్స్యకారులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో లెల్లెల బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఉచిత చేప, రొయ్యల పిల్లల కొనుగోలుకు సంబంధించిన నిధులను నేరుగా ప్రతి మత్స్య సహకార సొసైటీ ఖాతాల్లోనే జమ చేయాలని కోరారు. అలాగే 12 సంవత్సరాలుగా వివిధ కారణాలతో మరణించిన 986 మంది మత్స్యకారుల కుటుంబాలకు అందాల్సిన ఎక్స్‌గ్రేషియా బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 12 వేల చొప్పున దాదాపు రూ. 9 వేల కోట్ల వ్యక్తిగత నగదును జమ చేసినప్పుడు.. ఆర్థిక, ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మత్స్య పరిశ్రమను, మత్స్యకారులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉచిత చేప, రొయ్యల పిల్లల పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మత్స్యకారుల జీవిత భద్రత కోసం రూ. 20 లక్షల ఇన్సూరెన్స్ (ఎక్స్ గ్రేషియో) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రి పుష్ప, సీనియర్ నాయకులు కరెళ్లి లలిత, నగర ఉపాధ్యక్షులు గులాబ్ సింగ్, మహావీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత చేప, రొయ్య పిల్లల పథకాన్ని రద్దు చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



