రైతు సంఘం ‘రౌండ్ టేబుల్’లో రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, పలువురు నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను లిఫ్ట్ చేసి రైతులను, ప్రజలను ఆదుకోవాలని ప్రముఖ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ..ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందనీ, సెప్టెంబర్ వరకు వర్షాలు పడబోవని వాతావరణ శాఖ సూచిస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావం తెలంగాణ మీద తీవ్రంగా ఉండబోతున్నదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సాగు, తాగు నీటి కోసం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని లిఫ్ట్ చేయాలని కోరారు. 93.5మీటర్ల ఎత్తులో నీళ్లు ఉంటే లిఫ్ట్ చేయొచ్చనీ, జూలై నెలలో 97 మీటర్ల వరకు వచ్చాయని గుర్తుచేశారు. .నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపి దాని ఆధారంగా నీటిని లిఫ్ట్ చేసేందుకు అనుమతి తీసుకోవాలని కోరారు. రిటైర్డ్ ఇంజనీర్లమంతా కలిసి ఇటీవల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ రిజర్వాయర్లను సందర్శించామనీ, నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోవద్దనీ, సలహాలు ఇచ్చిన వారి మీదనే దుమ్మెత్తి పోయకుండా అవకాశాలను పరిశీలించి నీటిని లిఫ్ట్ చేయాలని విన్నవించారు. అంతకుముందు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడుతూ ..అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని వాపోయారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం బృందం పర్యటన చేసి ప్రాజెక్టులను పరిశీలించిందనీ, కచ్చితంగా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎన్డీఎస్ఎ మీద బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒత్తిడి చేసి అనుమతులు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. బ్యారేజీలకు అయిన ఖర్చును గత, ప్రస్తుత సీఎంలు తమ ఇంటి నుంచి ఖర్చుపెట్టలేదనీ, అవి ప్రజల డబ్బులతో కట్టినవని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నీళ్లను వృథా చేయడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేననీ, రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేసే చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం అవుతామని ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ … కరువు పరిస్థితులలో రైతులను ఆదుకోవాలని కోరారు. రాజకీయాలను పక్కనపెట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్ రావు, పి జంగారెడ్డి, కోశాధికారి మూడ్ శోభన్, సహాయ కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, దుబ్బాక రామ్ చందర్, అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రాము, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి నాగిరెడ్డి, ఎఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పని పద్మ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, కార్యదర్శి శ్రీరామ్ నాయక్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, మహిళా సంఘం నాయకులు సరళ, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



