నెలలో ఒకరోజు సైట్‌కి వస్తా.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల అదనపు పంపులను పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
పనులు వేగవంతం చేయాలని ఆదేశం
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారనుందనీ, నియోజకవర్గంలోని ప్రతి ప్రాజెక్టుపై నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి నెలలో ఒకరోజు సైట్‌లో ఉండి.. పనులపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట్‌లోని ఎడ్యుకేషన్ హబ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టల్ నిర్మాణ పనులు, వెటర్నరీ కాలేజీ, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరఫీ, పారా మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా సస్పెన్షన్‌కు వెనకాడొద్దన్నారు.
భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యంపై సీఎం మండిపడ్డారు. వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్దిదారులకు అందజేయాలని ఆదేశించారు. మక్తల్ -నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులన్నింటినీ వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సెప్టెంబర్‌లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భూ సేకరణ పూర్తి చేయాలని చెప్పారు. మూడవ పంపు ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులన్నీ జరిగాయా లేదో క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఫేజ్ -1 పనులు డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు సీఎంకి తెలపగా.. డిసెంబర్ 2027 వరకు ప్రతినెలా ఎంత మేర పనులు పూర్తి చేయగలుగుతారో సంతకాలతో సహా వివరాలు సమర్పించాలని అన్నారు.
ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో
సమన్వయంతో పనిచేయాలి
రంగారెడ్డి- వికారాబాద్- నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్చించి డిజైన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. రోడ్‌కు సంబంధించిన భూసేకరణ సెప్టెంబర్ 2026 లోగా పూర్తి చేస్తామని కలెక్టర్లు తెలిపారు. భూసేకరణ పూర్తయిన వెంటనే టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టాలని అన్నారు. భూసేకరణలో భాగంగా రైతులను ఒప్పించి కాన్సెంట్ అవార్డుకు వెళితే రైతులకు ఎక్కువగా నిధులు వచ్చే అవకాశంపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ విషయంపై సమన్వయం చేయాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15, 2028 లోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కులపైనా సమీక్ష నిర్వహించారు. దుద్యాల ఇండస్ట్రియల్ పార్కు గురించి అధికారులతో చర్చించారు. ఇండస్ట్రియల్ పార్క్‌కు అవసరమైన భూసేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణంలో టీజీఐఐసీ చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు. భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే , అక్టోబర్‌లో పనితీరు ఆధారంగా అవసరమైతే కలెక్టర్లను బదిలీ చేస్తామని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకు రోడ్లు, మౌలిక సదుపాయాలన్నీ కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, బుయ్యాని మోహన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వీపీ గౌతమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ టీకే శ్రీదేవి, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ సెక్రెటరీ శ్రీధర్, టీజీఐఐసీ ఎండీ శశాంక, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, సంబంధిత శాఖల హెచ్‌ఓడీలు తదితరులు పాల్గొన్నారు.



