నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ కంపదండి అశోక్, ఉపసర్పంచ్ ఉల్లంగుల శశిధర్ సోమవారం సందర్శించారు. ప్రభుత్వం పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించిన నేపథ్యంలో వారు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సమస్యలను ప్రధానోపాధ్యాయుడు కిషన్ ను అడిగి తెలుసుకున్నారు.
వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున తరగతి గదిలో నుండి విద్యార్థులు బయటకు రాకుండా తగిన పర్యవేక్షణ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు దాహార్తిని తీసుకునేందుకు అవసరమైన తాగునీటిని కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలని ఈ విషయాన్ని విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు.కార్యక్రమంలో వారి వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



