నవతెలంగాణ- సూర్యాపేట : డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని పాలక, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పరస్పరం ఛాలెంజ్‌లు విసురుకోవడం రాజకీయాల దిగజారుడుకు నిదర్శనమని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులపై డ్రగ్స్ వినియోగ ఆరోపణలు రావడం.. రాజకీయాలు ఎంతగా దిగజారాయో సూచిస్తోందన్నారు.
డ్రగ్స్ కేసుల్లో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇవ్వడం సరిపోదని, ఆయా పార్టీలు వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ వెంటనే చొరవ తీసుకోవాలని సూచించారు. దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టి ఆమోదించాలని, జనాభా లెక్కలు, డీలిమిటేషన్ పేరుతో ఆలస్యం చేయడం సరికాదని అన్నారు. రోహిత్ వేముల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ పరీక్షల ఛాలెంజ్‌లు రాజకీయ దిగజారుడుకు నిదర్శనం : బీవీ. రాఘవులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



