ప్రతిక్షణం విలువైనదేనన్న జపాన్ ప్రధాని
టోక్యో : జపాన్లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. క్షతగాత్రుల సంఖ్య వందలలోనే ఉంది. షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ముగ్గురు, పేపర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అనేక మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. విద్యుత్, మంచినీటి సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యాభై వేలకు పైగా కుటుంబాలు కరెంటు లేక అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. సుమారు లక్షన్నర ఆవాసాలకు నీటి సరఫరా బంద్ అయింది. భూకంపం సంభవించిన ప్రాంతంలో బుధవారం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూప్రకంపనలు సంభవిస్తాయేమోనన్న భయంతో చాలా మంది మంగళవారం రాత్రి తమ కార్లలోనే నిద్రించారు. తొమ్మిది వేల మందికి పైగా బాధితులను అధికారులు సహాయ శిబిరాలకు తరలించారు. భూకంపం సంభవించిన వెంటనే 200 షాపులున్న ఓ షాపింగ్ మాల్లో పేలుడు జరిగింది. ప్రధాన భవనంలోని పై అంతస్తు పాక్షికంగా కూలిపోయింది. భూకంపం సంభవించగానే వినియోగదారులను, సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. దక్షిణ ప్రాంతంలోని కుమమోటో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని ప్రధాని సానే టకైచీ బుధవారం తెలిపారు. శిథిలాల కింద చిక్కుబడిన వారి కోసం వేలాది మంది సైనికులు గాలింపు చేపట్టారని, ప్రస్తుత పరిస్థితులలో ప్రతి క్షణం విలువైనదేనని ఆయన అన్నారు. సహాయ కార్యక్రమాల కోసం 2,600 మంది సిబ్బందిని సమీకరించారు. గగనతలం నుంచి నష్టాన్ని అంచనా వేసేందుకు 20 విమానాలను పంపారు. భూకంపం ధాటికి అనేక బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. 2016లో సంభవించిన భూకంపంలో దెబ్బతిన్న ఒక చారిత్రక కోటకు తాజా ఘటనలో మరోసారి నష్టం వాటిల్లింది. భారీ భూకంపం వచ్చిన ప్రాంతాలలో రాబోయే వారం రోజులలో మరింత బలమైన ప్రకంపనలు సంభవించవచ్చునని, కొండచరియలు విరిగిపడతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. బుధవారం ఉదయానికి 60కి పైగా ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 1-4గా నమోదైంది.
13కు చేరిన భూకంప మృతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



