Thursday, July 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపేరు మారినా…బతుకు మారని ‘స్వచ్ఛ’ కార్మికులు

పేరు మారినా…బతుకు మారని ‘స్వచ్ఛ’ కార్మికులు

- Advertisement -

ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య బాధ్యతలు మోస్తున్న స్వచ్ఛ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేర్లు మార్చి అతి తక్కువ వేతనాలతో శ్రమను దోచుకోగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ కార్మికులకు గుర్తింపు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించడంలో విఫలమైంది. ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని ప్రకటిస్తూనే, మరోవైపు ఆ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన స్వచ్ఛ కార్మికులను నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న సుమారు 1100 మంది స్వచ్ఛ కార్మికులు నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 974 ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరుగుదొడ్ల శుభ్రత, తరగతి గదులు, కార్యాలయాలు, పాఠశాల ఆవరణ, ఆటస్థలాల పరిశుభ్రత, మొక్కల సంరక్షణ వంటి కీలక పనులను నిర్వహిస్తున్నప్పటికీ వారి శ్రమకు తగిన గుర్తింపు లేదు. గతంలో స్కావెంజర్ల పేరుతో అతి తక్కువ వేతనాలతో పనిచేయించిన కార్మికులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమంగా తొలగించింది.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (AAPC) ఆధ్వర్యంలో మళ్లీ సేవలను కొనసాగిస్తున్నప్పటికీ, శ్రమదోపిడీ మాత్రం కొనసాగుతూనే ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పేరు మారినా విధానం మారలేదని వారు అంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాలు నిర్ణయించినా, జిల్లాలో ఎక్కువ పాఠశాలల్లో ఇద్దరు కార్మికులు పనిచేయడంతో ఒక్కొక్కరి చేతికి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు మాత్రమే మిగులుతోంది. పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో ఈ మొత్తంతో కుటుంబాలను పోషించడం అసాధ్యంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు పేరుతో వారి వేతనాల్లోనే కోతలు విధించడం మరో దోపిడీగా మారింది.గత నాలుగు నెలలుగా సుమారు రూ.51.81 లక్షల వేతనాలు బకాయిగా ఉండగా, జూలై నెలతో బకాయిలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.

ఇతర జిల్లాల్లో బకాయిలు విడుదల చేసినప్పటికీ సిద్దిపేట జిల్లాలో మాత్రం అధికారులు జాప్యం చేయడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు లేక అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడంలో స్వచ్ఛ కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనప్పటికీ, వారికి గుర్తింపు కార్డులు, యూనిఫాంలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు ఇప్పటికీ అందడం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనాలు పెంచి శాశ్వత భద్రత కల్పించాలని స్వచ్ఛ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

గొడ్డుబర్ల భాస్కర్, 9849934514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -