Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కజొన్న అమ్మకాల్లో మార్క్‌‌ఫెడ్‌ చరిత్ర

మొక్కజొన్న అమ్మకాల్లో మార్క్‌‌ఫెడ్‌ చరిత్ర

- Advertisement -

మెట్రిక్‌ టన్నుకు సగటున రూ.25,370
ఈ టెండర్‌‌కు బదులుగా ఈ-వేలంతో భారీ లాభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మొక్కజొన్న విక్రయాల్లో మార్క్‌‌ఫెడ్‌ చరిత్ర సృష్టించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సాంప్రదాయ ఈ-టెండర్ విధానాన్ని పక్కనపెట్టేసి ఈ-వేలం విధానాన్ని అమలు చేయడంతో మొక్కజొన్నకు రికార్డు స్థాయిలో ధర లభించింది. ఈ వేలాల్లో మెట్రిక్ టన్నుకు గరిష్టంగా రూ.26,500, కనిష్టంగా రూ.24,100, సగటున రూ.25,370 ధర నమోదైంది. కొనుగోలు ధరతో పోలిస్తే టన్నుకు సుమారు రూ.1,500 లాభం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరనుంది.
​‌నష్టాల్లో ఉన్న మార్క్‌‌ఫెడ్‌ను లాభాల బాట పట్టించేలా తీసుకునేలా చర్యలకు మంత్రి తుమ్మల ఆదేశించిన విషయం విదితమే. సంస్కరణల్లో భాగంగానే ఈ-టెండర్ విధానానికి బదులుగా పోటీని పెంచే ఈ-వేలం విధానాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్‌లో పోటీ పెరిగి రైతులు, ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరే విధంగా అత్యుత్తమ ధర లభించింది. యాసంగి సీజన్‌లో సుమారు 14.60 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్క్‌‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ‌రాష్ట్ర చరిత్రలో మొక్కజొన్న ఈ స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. అంత పెద్ద మొత్తంలో మొక్కజొన్నను నిల్వ చేసేందుకు తగినన్ని గిడ్డంగులు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓపెన్ షెడ్లు, కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు తదితర తాత్కాలిక గిడ్డంగుల్లో నిల్వ చేయాల్సి వచ్చింది. వీటిలో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వర్షాలకు తడిచిపోయే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ఉండటంతో, ఆ స్టాక్‌ను 30 రోజుల్లో లిఫ్టింగ్ పూర్తి చేయాలనే నిబంధనతో ప్రత్యేక ఈ-వేలం ద్వారా మెట్రిక్ టన్నుకు రూ.22,000 ధరకు త్వరితగతిన విక్రయించారు. దీంతో వర్షాల కారణంగా మొక్కజొన్న దెబ్బతిని ప్రభుత్వానికి సంభవించే భారీ నష్టాన్ని పూర్తిగా నివారించడం సాధ్యమైంది. మిగిలిన సుమారు 10.98 లక్షల మెట్రిక్ టన్నుల సురక్షిత గిడ్డంగుల్లో ఉన్న మొక్కజొన్నకు మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి బేస్ ప్రైస్‌ను మెట్రిక్ టన్నుకు రూ.24,000గా నిర్ణయించి జూలై 31, ఆగస్టు 1, ఆగస్టు 3 తేదీల్లో మూడు విడతలుగా ఈ-వేలాలు నిర్వహించారు. మొత్తంగా 10,98,388 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఈ-వేలం ద్వారా విక్రయించగా, కనిష్ట ధర రూ.24,100, గరిష్ట ధర రూ.26,500, సగటు ధర రూ.25,370 లభించింది. మార్క్‌ఫెడ్ చరిత్రలో ఇంత భారీ పరిమాణంలో మొక్కజొన్నను ఇంత మంచి ధరకు విక్రయించడం ఇదే తొలిసారి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, పారదర్శక ఈ-వేలం విధానం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న వ్యూహాత్మక చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు ప్రజాధనాన్ని పరిరక్షించగలిగామని అధికారులు వెల్లడించారు. ​

ఈ మూడు విడతల వేలాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి
​ఈవేలం మెట్రిక్‌ ‌టన్నులు కనిష్ట ధర గరిష్ట ధర సగటు ధర
మొదటి 3,70,895 రూ.24,900 రూ.25,600 రూ.25,192
రెండో 3,68,154 రూ.24,100 రూ.26,500 రూ.25,329
మూడో 3,59,339 రూ.25,200 రూ.26,000 రూ.25,594

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -