Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోర్టు వివాద భూములకూ మ్యూటేషన్‌లా..! ?

కోర్టు వివాద భూములకూ మ్యూటేషన్‌లా..! ?

- Advertisement -

పరకాల తహసీల్దార్ కార్యాలయంపై వరుస ఆరోపణలు..
కలెక్టర్ స్థాయిలోనూ సాధ్యం కాని వ్యవహారాలు స్థానిక స్థాయిలో ఎలా..?
మరో వివాదాస్పద మ్యూటేషన్‌తో ఆందోళనలో అసలైన హక్కుదారుల
నవతెలంగాణ – పరకాల 

కోర్టు వివాదంలో ఉన్న భూములకు సైతం రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌లు జరుగుతున్నాయన్న ఆరోపణలు పరకాల రెవెన్యూ కార్యాలయంపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తుండగా, తాజాగా మరో కోర్టు వివాద భూమికి మ్యూటేషన్ జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, పరకాల రెవెన్యూ శివారు పరిధిలోని పలువురి సర్వే నంబర్లలో ఉన్న మొత్తం 4 ఎకరాల 25 గుంటల భూమికి సంబంధించి మ్యూటేషన్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.

బాధితుడు తిక్క శంకరయ్య ఆరోపణల ప్రకారం, తన పేరుతో 1985-86 సంవత్సరాల్లో జరిగినట్లు చూపుతున్న విక్రయ రిజిస్ట్రేషన్ పత్రాలు వాస్తవానికి చెల్లుబాటు కావని, పాత మార్టిగేజ్ రుణాలకు సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్లను ఉపయోగించి అవి రూపొందించారని పేర్కొంటున్నారు. అంతేకాక, ఆ కాలంలో తన పేరుపై రెవెన్యూ రికార్డుల్లో పట్టా లేదా కాస్తు నమోదు లేకపోయినప్పటికీ విక్రయాలు జరిగినట్లు నమోదు కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అంటున్నారు.

ఈ పత్రాల ఆధారంగా ఇటీవల రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 182/ఆ, 570/ఆ, 640/B, 698/ఆ, 750/2, 751/1/ఆ, 752/A/ఇ సర్వే నంబర్లలోని భూమిలోని భాగాలను పలువురి పేర్లపై నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు, ఇదే భూమికి సంబంధించి తిక్క శంకరయ్య, కొలగాని నాగరాజు మధ్య న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యూటేషన్ ప్రక్రియ చేపట్టడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు విచారణలో ఉన్న భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం నిబంధనలకు అనుగుణమేనా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

ఇప్పటికే పరకాల రెవెన్యూ కార్యాలయంలో ఇలాంటి వివాదాస్పద మ్యూటేషన్‌లు వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో, తాజా ఘటనతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, మ్యూటేషన్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అనే అంశాన్ని తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ అధికారులు తమ వివరణ ఇవ్వాల్సి ఉంది. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -