Saturday, August 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రత్యామ్నాయ జర్నలిజమే నవతెలంగాణ

ప్రత్యామ్నాయ జర్నలిజమే నవతెలంగాణ

- Advertisement -

ప్రజలకు ప్రభుత్వానికి వారధి : టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి
రిపోర్టింగ్ ఉద్యోగం కాదు సామాజిక బాధ్యత :ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌
కష్టజీవుల పక్షాన నిలిచే పత్రిక : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్‌
నిజాయితీగా వార్తలు రాసేది : సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్
సంగారెడ్డిలో మెదక్‌ రీజియన్‌ 11వ వార్షికోత్సవ సభ

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి ​
ప్రజలకు ఏం అవసరమో తెలుపుతూ నిరంతరం పని చేస్తున్న పత్రిక నవతెలంగాణ అని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్ రీజియన్ ఆధ్వర్యంలో నవతెలంగాణ 11వ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక సంచికను వక్తలు ఆవిష్కరించారు. సభకు హాజరైన టీజీఐఐసీ చైర్‌‌పర్సన్‌, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు ‌నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నవతెలంగాణ పత్రిక నిలుస్తోందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నదని తెలిపారు. పత్రికల ద్వారానే ప్రజలకు సమాచారం చేరుతుందన్నారు. నవతెలంగాణ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నవతెలంగాణ ఎడిటర్‌ ‌రాంపల్లి రమేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనశక్తి, ప్రజాశక్తి, ప్రస్తుతం తెలంగాణలో నవతెలంగాణగా ఈ పత్రిక ఉందని తెలిపారు. 80 ఏండ్ల ప్రస్థానం నవతెలంగాణకు మాత్రమే ఉందనీ, ఇంతటి చరిత్ర ఏ పత్రికలకు లేదని అన్నారు. ప్రజలు, కార్మికులు, రైతాంగం, యువకులు, మహిళల సమస్యలను నిరంతరం తన వార్తా రచనల ద్వారా అందిస్తూ వాటి పరిష్కారం కోసం అలుపెరగని కృషిని కొనసాగిస్తున్నదని తెలిపారు.

పత్రికలు, ఎలక్ట్రానికి మీడియా, యూట్యూబ్ చానళ్లు ఎన్నో వచ్చాయని తెలిపారు. దీంతో వార్తలను వెతుక్కునే పరిస్థితి పోయి… సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. అయితే వార్తలు అనేకం వస్తున్నప్పటికీ అందులో నిజం అరుదైన విషయంగా మారిందని తెలిపారు. నిజం వినిపించనంత శబ్దం అబద్ధాలు చేస్తున్నాయన్నారు. చూడాల్సిందే చూస్తున్నామా.. చూపించిందే చూస్తున్నామా అన్నది పరిశీలించుకోవాలన్నారు. ఏం జరిగిందో చెప్పడానికి కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయని, ఎందుకు జరిగిందో చెప్పడానికి నవతెలంగాణ మాత్రమే ప్రత్యామ్నాయ గొంతుకగా ఉందని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ సంచలనం సృష్టించిందని, సమరశీల ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిందన్నారు. తిరుగులేని శక్తులం.. రారాజులం అనేవారిని నేలకు దించిందని చెప్పారు. ఇప్పటి వరకు సీఎం గోబ్యాక్, పీఎం గోబ్యాక్ అనే నినాదాలు విన్నాం కానీ.! జంతర్‌ ‌మంతర్‌‌లో మొదటి సారిగా మీడియా గోబ్యాక్ అనే నినాదాలు వినాల్సి వచ్చిందన్నారు.

20 రోజులుగా నిరసనకారులు అన్నం నీళ్లు మానేసి నిరాహార దీక్షలు చేపడితే కనీసం కవర్‌ ‌చేయడానికి రాని మెయిన్‌ ‌స్ట్రీమ్‌ మీడియా వాళ్లు.. చలో పార్లమెంట్‌కు వెళ్తున్న వారి తలలు పగిలి ఉద్యమం రక్తసిక్తమవుతుంటే సంచలనాల కోసం అక్కడికి వెళ్లడంతో వారు మీడియా గోబ్యాక్‌ అనాల్సి వచ్చిందని తెలిపారు. నవతెలంగాణ పత్రిక మాత్రమే నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలిసేలా రాస్తుందన్నారు. ప్రత్యామ్నాయ జర్నలిజం నవతెలంగాణ మాత్రమేనని తెలిపారు. రిపోర్టింగ్ అనేది ఉద్యోగం కాదని, అది ఒక గురుతర బాధ్యత అని గుర్తు చేశారు. ఈ సభలో నవతెలంగాణ జీఎం నరేందర్ రెడ్డి, మొఫిసిల్‌ రాష్ట్ర నెట్ వర్క్ ఇన్‌‌చార్జి వేణుమాదవ్ రావు నవతెలంగాణ విశిష్టతను తెలియజేశారు.మెదక్‌ రీజియన్‌ మేనేజర్ రేవంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉమ్మడి జిల్లా స్టాఫర్‌ దండు ప్రభు, డెస్క్ ఇన్‌‌చార్జి దస్తగిరి, నర్సింహ్మరెడ్డి, రజిత, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, సతీష్, కాంగ్రెస్, సీపీఐ, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ఉమ్మడి జిల్లా నవతెలంగాణ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

​నిజాయితీగా వార్తలు రాసేది..: సయ్యద్ జలాలుద్దీన్
నీతి, నిజాయితీగా కులమతాలకు అతీతంగా వార్తలు రాసేది నవతెలంగాణ పత్రిక అని సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ అన్నారు. కలంలో చాలా పవర్ ఉంటుందని, నిస్వార్థంగా పని చేయాలని సూచించారు. పత్రికలు ఎన్ని ఉన్నా నవతెలంగాణ పత్రిక మాత్రం అన్ని వర్గాల సమస్యలపై నిరంతరం తమ గళం వినిపిస్తుందన్నారు.

​కష్టజీవుల పక్షాన నిలిచేది : జయరాజు
కష్టజీవుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నవతెలంగాణ అండగా నిలుస్తుందని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. ప్రభుత్వాలు పేదల భూములను తీసుకుంటే న్యాయం చేయాలని పోరాటాలు నిర్వహిస్తే ఏ పత్రికలు వారికి అండగా నిలబడకున్నా నవతెలంగాణ మాత్రం న్యాయం జరిగే వరకు అనేక వార్తల రూపంలో అండగా నిలిచిందన్నారు. మల్లన్న సాగర్ పోరాటంలో నవతెలంగాణ పత్రిక కీలకభూమిక పోషించిందని కొనియాడారు. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం ఇవ్వాలని నవతెలంగాణ వార్తలు రాస్తే బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అయినా వాటికి బెదరకుండా నిక్కచ్చితంగా వార్తలను రాసి రైతులకు అండగా నిలిచిందన్నారు. సిగాచీ పరిశ్రమలో పేలుడు జరిగి 54 మంది చనిపోతే వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కోటి పరిహారం ప్రకటించి అందించలేదని అన్నారు. ఆ పోరాటాన్ని, కార్మికుల కష్టాలను నవ తెలంగాణ కండ్లకు కట్టినట్టు చూపించిందని తెలిపారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -