Sunday, August 9, 2026
E-PAPER
Homeహెల్త్పిల్లలకు లిఫ్ట్‌లు ఇస్తున్నామా... జీవితానికి మెట్లు తీసేస్తున్నామా?

పిల్లలకు లిఫ్ట్‌లు ఇస్తున్నామా… జీవితానికి మెట్లు తీసేస్తున్నామా?

- Advertisement -

పిల్లలకు లిఫ్ట్‌లు ఇస్తున్నామా.. జీవితానికి మెట్లు తీసేస్తున్నామా? ఒక చిన్న సంఘటన వెనుక పెద్ద మనస్తత్వ శాస్త్రం. ఈమధ్య ఒక శుభకార్యానికి వెళ్లాను. చుట్టూ బంధువులు, స్నేహితులు, పిల్లల గురించి ముచ్చట్లు.. ఎవరి బిడ్డ ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఎన్ని మార్కులు తెచ్చాడు? ఏ కోచింగ్‌కు వెళ్తున్నాడు? అనే చర్చలు. నేను కూడా పక్కనే కూర్చుని వింటున్నాను. ఒక తల్లి గర్వంగా చెప్పింది.. ‘ఆ స్కూల్లో మెట్లు చాలా ఉన్నాయి. అందుకే మా బాబుని అక్కడ జాయిన్‌ చేయలేదు’ వెంటనే మరో తల్లి.. ‘అవునండి.. నేను కూడా లిఫ్ట్‌ ఉన్న స్కూల్లోనే మా పిల్లలను చేర్పించాను’. అది విన్న వెంటనే నా మనసులో ఒకే ప్రశ్న…

‘మనం పిల్లలకు విద్య నేర్పిస్తున్నామా.. లేక సౌకర్యాల మీద ఆధారపడటం నేర్పిస్తున్నామా?’. ఒకప్పుడు పిల్లలు నాలుగు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవారు. ఇప్పుడు నాలుగు మెట్లు ఎక్కాల్సి వస్తే అది కూడా సమస్యగా మారుతోంది. పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇవ్వడం తప్పు కాదు. కానీ ప్రతి చిన్న కష్టాన్ని కూడా తొలగించడం ప్రమాదకరం. ఎందుకంటే… జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను తల్లిదండ్రులే పరిష్కరిస్తూ ఉంటే, పిల్లల మెదడు సమస్యలను ఎదుర్కోవడం కాకుండా వాటి నుంచి తప్పించుకోవడం నేర్చుకుంటుంది. అలాంటి పిల్లలు పెద్దయ్యాక చిన్న చిన్న విషయాలకే కుంగిపోతారు.

నిజ జీవిత కేసు – 1
పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి కౌన్సెలింగ్‌కు వచ్చాడు. ‘నాకు 95% మాత్రమే వచ్చింది మేడం.. ఇంట్లో అందరూ నిరాశపడ్డారు. నేను పనికిరానివాడినని అనిపిస్తోంది’. ఆ పిల్లవాడి బాధ మార్కుల గురించి కాదు. చిన్నప్పటి నుంచి ప్రతి పని తల్లిదండ్రులే చేసి పెట్టారు. బ్యాగ్‌ సర్దడం, హోంవర్క్‌ గుర్తు చేయడం, ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం, చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే సహాయం. కానీ జీవితంలో మొదటిసారి అపజయం ఎదురైనప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో అతనికి తెలియలేదు.

నిజ జీవిత కేసు – 2
ఒక కాలేజీ విద్యార్థిని కౌన్సెలింగ్‌కు వచ్చింది. హాస్టల్‌లో మొదటి నెల నుంచే నేను ఇంటికి వచ్చేస్తాను అని ఒకటే ఏడుపు. ‘ఇంట్లో అమ్మే అన్నీ చేసేది మేడం.. నేను ఒక్కసారి కూడా బట్టలు ఉతకలేదు, వంట చేయలేదు, చిన్న పనులు కూడా చేయలేదు. ఇప్పుడు ఏ పని చేయాలో తెలియడం లేదు’. ఆమెకు చదువు సమస్య కాదు. జీవితంలో నేర్చుకునే అవకాశం లేకపోవడమే సమస్య.

నిజ జీవిత కేసు – 3
ఒక యువకుడు ఉద్యోగంలో చేరి వారం రోజుల్లోనే రాజీనామా చేశాడు. కారణం? ‘బాస్‌ కొంచెం గట్టిగా మాట్లాడారు’. అంతే.. చిన్నప్పటి నుంచి ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు. ఎప్పుడూ పొగడ్తలే. అందుకే విమర్శను కూడా భరించే శక్తి పెరగలేదు. బలహీనమైన కండరాల్లాగే.. బలహీనమైన మనసు కూడా తయారవుతుంది. జిమ్‌కి వెళ్లే వాళ్లకు తెలుసు.. బరువులు ఎత్తితేనే కండరాలు బలపడతాయని. అలాగే.. చిన్న చిన్న బాధ్యతలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అపజయాలు ఎదుర్కొంటేనే మనసు బలపడుతుంది. ప్రతి రాయిని తొలగిస్తే పిల్లలు నడవడం నేర్చుకోరు. రాయిని ఎలా దాటాలో నేర్పితే మాత్రం జీవితమంతా ధైర్యంగా నడుస్తారు.

మనం తెలియక చేస్తున్న పొరపాటు ఈరోజు పిల్లలు పడిపోతారేమో అని సైకిల్‌ తొక్కనివ్వడం లేదు. చెమట పడుతుందేమో అని నడవనివ్వడం లేదు. ఆకలేస్తుందేమో అని ప్రతి గంటకోసారి తినిపిస్తున్నాం. విఫలమవుతారేమో అని పోటీల్లో పాల్గొననివ్వడం లేదు. ఇవన్నీ ప్రేమతో చేస్తున్న పనులే. కానీ.. ప్రేమ పేరుతో ధైర్యాన్ని తీసేస్తే, రేపు జీవితం ముందు నిలబడే శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే నేటి యువతలో.. పరీక్షలో తక్కువ మార్కులు, ఉద్యోగం రాకపోవడం, ప్రేమ విఫలం కావడం, చిన్న విమర్శ… దీనికే జీవితం ముగిసిపోయిందని భావించి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇది ఒక్క కారణం వల్ల కాదు. చిన్నప్పటి నుంచి కష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణమే.

తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి
మీ పిల్లలకు మంచి స్కూల్‌ ఇవ్వండి. మంచి బట్టలు కొనండి. మంచి ఆహారం పెట్టండి. కానీ.. మెట్లు ఎక్కాల్సిన చోట లిఫ్ట్‌ వెతకడం మాత్రం నేర్పొద్దు. వారి బ్యాగ్‌ను వారినే మోయనివ్వండి. వారినే సమస్యను పరిష్కరించనివ్వండి. కొన్ని సార్లు ఓడిపోనివ్వండి. కొన్ని సార్లు ఏడవనివ్వండి. ఎందుకంటే ఓటమిని అర్థం చేసుకున్న పిల్లవాడే విజయాన్ని నిలబెట్టుకోగలడు. మెట్లు ఎక్కిన పిల్లలకు కాళ్లు బలపడతాయి. కష్టాలు ఎక్కిన పిల్లలకు మనసు బలపడుతుంది. మన బాధ్యత పిల్లల జీవితాన్ని పూర్తిగా సులభం చేయడం కాదు. జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని వారికి అందించడం. అదే నిజమైన పేరెంటింగ్‌.. అదే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప వారసత్వం.
‘పిల్లల కోసం ప్రతి మెట్టునూ తొలగించొద్దు.. ఆ మెట్లు ఎక్కే ధైర్యాన్ని మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే లిఫ్ట్‌ పైకి తీసుకెళ్తుంది.. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మెట్లే నిర్మిస్తాయి’.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -