Sunday, August 9, 2026
E-PAPER
Homeమానవిమన గొంతుమనమే వినిపించాలి

మన గొంతుమనమే వినిపించాలి

- Advertisement -

డా. నూర్జహాన్‌… ముస్లిం మహిళలు భయపడుతూ బతకకూడదు. తమ కలలను నిజం చేసుకోవడానికి బతకాలి. స్వేచ్ఛగా బతకాలి. నాయకత్వంలోకి రావాలి. వారి గొంతు విప్పాలి. ఈ లక్ష్యంతోనే భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ అనే సంస్థను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ముస్లిం కుటుంబాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముస్లిం మహిళ గొంతు ఈ సమాజానికి వినిపించేందుకు అహర్నిశలూ తపిస్తున్న ఆమెతో మానవి సంభాషణ…

ముస్లిం మహిళల కోసం మీరు ఓ సంస్థను స్థాపించారు. దాని గురించి చెబుతారా?
అవును, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌. ఇది 2007లో ప్రారంభించాము. మాది జాతీయ సంస్థ. ముంబయి కేంద్రంగా మా పని జరుగుతుంది. ముస్లిం మహిళలను నాయకత్వ స్థాయిలోకి తీసుకురావడం మా లక్ష్యం. అలాగే ముస్లిం మహిళల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి వాళ్ల గొంతును ఈ సమాజానికి వినిపిండం మా ఉద్దేశం. ప్రభుత్వాన్ని చూసి భయపడడం, మత పెద్దలను చూసి భయపడటం వంటివి మహిళలకు ఉండకూడదు. మన సమస్యలపై మనమే పోరాడాలి, మన గొంతును మనమే వినిపించాలి అనే చైతన్యాన్ని ముస్లిం మహిళల్లో నింపే కృషి చేస్తున్నాం.

మీ సంస్థ ఆధ్వర్యంలో మీరు చేసిన కార్యక్రమాలు?
భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ ఆధ్వర్యంలో చాలా ఏండ్ల నుండి ముస్లిం కుటుంబాల్లో రావల్సిన మార్పుల గురించి అధ్యయనం చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. దీని కోసం క్షేత్రస్థాయిలో దిగబడి పని చేస్తున్నాం. 2019లో కేంద్ర ప్రభుత్వం త్రిబుల్‌ ‌తలాక్‌ ‌రద్దు చేసింది. దీని కోసం మేము ఎన్నో ఏండ్లు పోరాటం చేశాము. ఇది రద్దు కాకముందు ఎన్నో ముస్లిం కుటుంబాలను కలిసి ఆ మహిళలతో మాట్లాడాం. ముఖ్యంగా బహుభార్యత్వం అనేది ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. చాలా మంది రెండు పెండిండ్లు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాల్లోని ఇద్దరు మహిళలను కలిసి వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకున్నాం. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, వెస్ట్‌ ‌బెంగాల్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ ‌వంటి ఏడు రాష్ట్రాలలోని 2500 మంది ముస్లిం మహిళలను కలిసి మాట్లాడాం.

మీరు తీసుకొచ్చిన ‘బ్రేకింగ్‌ ‌ది సైలెన్స్‌’ పుస్తకం గురించి చెబుతారా?
మా అధ్యయనంలో తెలిసిన ముఖ్యమైన విషయాలన్నింటినీ అంకెలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచాము. మహిళలు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇలా అనేక రకాలుగా బాధలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా బహుభార్యత్వం. ఇద్దరు భార్యలూ హింసకు గురవుతున్నారు. అయితే మొదటి భార్యపై కాస్త ఎక్కువ హింస ఉంటే, రెండో భార్యపై కాస్త తక్కువ అంతే. మా అధ్యయనంలో వచ్చిన సమస్యలన్నింటినీ ఓ రిపోర్టు తయారు చేసి ‘బ్రేకింగ్‌ ‌ది సైలెన్స్‌’ పేరుతో పుస్తకం కూడా ముద్రించాం. దీన్ని హిందీలో కూడా తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నాం.

త్రిబుల్‌ ‌తలాక్‌ ‌రద్దు వల్ల ముస్లిం మహిళలకు ఏమైనా మేలు జరిగిందనుకుంటున్నారా?
కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళలపై దయదలచి ఇచ్చిన చట్టమేమీ కాదు ఇది. ఎన్నో పోరాటాల ఫలితంగా దీన్ని సాధించుకోగలిగాం. చట్టం రావడం ముఖ్యం కాదు అది అమలు జరగడం చాలా అవసరం. అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత తలాక్‌‌ల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో ఒక్క నిమిషంలోనే తలాక్‌ అని మూడు సార్లు చెప్పి మహిళలను ఇంట్లో నుండి గెంటేసేవాళ్లు. కానీ ఇప్పుడు మగవాళ్లలో కాస్త భయం పెరిగింది. ఇది కూడా మా సర్వే ద్వారానే తెలుసుకున్నాం. వీటి శాతాన్ని కూడా మా పుస్తకంలో పొందుపరిచాము. అయితే ఏ చట్టం వచ్చినా సమూలమైన మార్పు అయితే జరగదు. ఆ విషయం మాకు తెలుసు. సమాజంలో మార్పు రాదు. అయితే మహిళలకు కాస్త ఊరట మాత్రం వచ్చింది.

ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తున్న సర్‌ ‌వల్ల మహిళల ఓట్లే ఎక్కువగా గల్లంతు అవుతున్నాయి. దీని గురించి మీరేమంటారు?
సర్‌ అనేది నిరంతరం జరిగే ఓ ప్రక్రియ. అయితే దీన్ని రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారో మనం ఆలోచించాలి. లక్షల ఓటర్లు తమ ఓట్లను కోల్పోతున్నారు. వాళ్లకు ఓట్లు వెయ్యరు అని అనుమానం వస్తే చాలు ఆ ఓట్లు మాయమైపోతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకం. ముఖ్యంగా ముస్లిం వ్యతిరేక విధానాలు దేశంలో నడుస్తున్నాయి. అందుకే రాజకీయాల్లో కూడా ముస్లింలు ముఖ్య పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాటి వ్యతిరేక విధానాలపై మేము కచ్చితంగా పోరాడతాం. ప్రశ్నిస్తాం, మా సమస్యలను పరిష్కరించుకుంటాం.

ఏండ్లు గడుస్తున్నా ముస్లింలు చదువుకు చాలా దూరంగానే ఉంటున్నారు, దీనికి కారణం?
ముందు తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మిగిలిన మతాల వారు కొంత వరకైనా తమ ఆడపిల్లలకు స్వేచ్ఛనిస్తున్నారు. కానీ ముస్లింలు ఆడపిల్లలను ఇంకా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికీ 13 ఏండ్లకే ఆడపిల్లలకు పెండ్లి చేస్తున్నారు. ఆ పెండ్లి చేసేది తల్లిదండ్రులే కదా! కనుక మార్పు కుటుంబం నుండి రావల్సిన అవసరం ఉంది. దీనిపై ముస్లిం కుటుంబాల్లో అవగాహన పెంచాల్సిన అవసరం చాలా ఉంది.

​ఇటీవల కాలంలో ప్రశ్నించే వారిపై దాడులు పెరిగిపోతున్నాయి, మీరేమైనా అలాంటివి ఎదుర్కొన్నారా?
చాలానే ఎదుర్కొన్నా. చీర కట్టుకోదు, బుర్ఖా వేసుకోదు. అంటూ కామెంట్లు చేస్తుంటారు. ప్రశ్నించినందుకు మాటలతో హింసిస్తారు, ట్రోల్‌ ‌చేస్తుంటారు. వీటన్నింటిని ఎదుర్కొంటూనే ఉన్నాం. పోరాడుతూనే ఉన్నాం.

మీరు చేస్తున్న ఉద్యమాలకు మీ కుటుంబ సహకారం ఉందా?
ఉంది. చిన్నతనం నుండి సోషల్‌ ‌వర్క్‌ అంటే నాకు చాలా ఇష్టం. ముంబైలోనే పుట్టి పెరిగాను. మా అమ్మానాన్న ఇద్దరూ బాగా చదువుకున్నారు. నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహించేవారు. బీఏ ఫిలాసఫీ చేశాను. సోషల్‌ ‌వర్కలో మాస్టర్స్‌ ‌పూర్తి చేసి అనేక ఎన్‌‌జీఓలతో కలిసి పని చేశాను. ఎక్కడ ఉన్నా ముస్లింల సమస్యలపైనే మాట్లాడతాను. ఇప్పుడు నా భర్త కూడా నేను చేస్తున్న పనికి సపోర్ట్‌ ‌చేస్తున్నారు. మాది మతాంతర వివాహం.

సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -