Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ నాళా ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో

కౌలాస్ నాళా ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో

- Advertisement -

ఆందోళనదలో రైతన్నలు
నవతెలంగాణ – జుక్కల్ 

వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు కౌలాస్ నాళా ప్రాజెక్ట్ లోకి పూర్తి స్థాయి నీటి మట్టం చేరకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రాజెక్టు పరిధి ఉన్న డి1, డి2, డి3, డి4, డి5, డి6 కాలువల్లో పిచ్చిమొక్కలు, తుంగలు పెరగడంతో పాటు మట్టి పేరుకుపోయి, కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో నీటి ప్రవాహం చివరి ఆయకట్టు వరకు ప్రవహించడం లేదు. అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు మరమ్మత్తు పనులను చేపట్టారు. ఇక అదే చివరాఖరు అన్నట్టు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ప్రాజెక్టును పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. గ్రీసింగ్ , జనరేటర్ పనులను ప్రతి ఏటా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరగాలి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాకపోవడంతో కనీసం ప్రాజెక్టు డోర్స్ కూడా తెరుచుకుంటాయో లేక మొరాయిస్తాయో అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్నేండ్లుగా ప్రాజెక్టు రిపేర్, గ్రీసింగ్ కూడా నిధులను తెలంగాణ ప్రభుత్వాలు మంజూరు చేయడం లేదని నీటి పారుదల శాఖాదికారులు పెదవి విరిచారు.

                2026 జూన్ మాసం నుండి ప్రారంభమైన తొలకరి వర్షాలు ప్రాజెక్టులోకి వచ్చిన నీటి వివరాలు : ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458  మీటర్లు.. కెపాసిటీ 1.237 టీఎంసీ. జూలై మాసంలో భారీ వర్షాలు పడకపోవడంతో నీరు లేక ప్రాజెక్టు వెలవెల బోయింది. జులై 29న పడిన కొద్దిపాటి వర్షానికి 740 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జులై 30న 610 క్యూసెక్కులు, జులై 31న 1940 క్యూసెక్కులు, ఆగస్టు 1న 510 క్యూసెక్కులు, ఆగస్టు 2న 220 క్యూసెక్కులు, ఆగస్టు 3న 210 క్యూసెక్కులు, 4న 555 క్యూసెక్కులు, 5న 450 క్యూసెక్కులు,  6న 350 క్యూసెక్కులు, 7న 240 క్యూసెక్కులు, 8న 985 క్యూసెక్కులు, ప్రతిరోజు ఉదయం 6 గంటల సమయానికి ఇన్ ఫ్లో వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు. ఆదివారం నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి నిలువ 457. 25 మీటర్ల వద్ద కొనసాగుతోందని స్పష్టం చేశారు.

     ప్రాజెక్టు ద్వారా బిచ్కుంద, జుక్కల్ మండాలల పరిధిలోని గ్రామాలలో ఉన్న 1200 ఎకరాలకు సాగునీరు అందించగల కెపాసిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. కానీ ప్రాజెక్టు కాలువల్లో దాశాబ్దాలుగా పేరుకుపోయిన మట్టి, పిచ్చి మొక్కల కారణంగా ప్రస్తుతం 500 ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. కానీ చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో పాటు పాలకులు, ప్రభుత్వం కూడా స్పందించి, కౌలాస్ నాళా ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చి, దీనిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలని స్తానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -